పుట్టిన ప్రతి బిడ్డకు తల్లి పాలే పెద్ద కానుక అనడంలో సందేహమే లేదు.తల్లి పాలు బిడ్డకు అమృతం వంటివి.
జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలన్నా.అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలన్నా తల్లి పాలు బిడ్డకు చాలా అవసరం.
అందుకే వైద్యులు, మన పెద్దలు కనీసం ఆరు నెలల నుంచి సంవత్సరం అయినా బిడ్డకు తల్లి పాలనే పట్టాలని చెబుతుంటారు.తల్లి పాలనే బిడ్డకు పట్టడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటుగా భవిష్యత్తులో మధుమేహం, ఆస్తమా, అలర్జీ, కొన్ని రకాల క్యాన్సర్లు, జలుబు, జ్వరాలు వంటి జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.
అలాగే తల్లి పాలు తాగే పిల్లల మెదడు కూడా ఎంతో చురుగ్గా పని చేస్తుందట.అయితే బరువు పెరుగుతామనో లేదా ఇతరితర కారణాల వల్ల కొందరు తల్లులు బిడ్డకు పాలిచ్చేందుకు ఇష్టపడరు.
కానీ, పాలివ్వడం వల్ల కేవలం బిడ్డకే కాదు.తల్లి కూడా బోలెడన్ని ప్రయోజనాలు పొందొచ్చని అంటున్నారు.
ముఖ్యంగా బిడ్డకు పాలిచ్చి పెంచిన తల్లుల్లో రొమ్ము మరియు ఒవేరియన్ క్యాన్సర్లు వచ్చే రిస్క్ చాలా తక్కువగా ఉంటుందట.పలు అధ్యయనాల తర్వాత ఈ విషయాన్ని స్వయంగా శాస్త్రవేత్తలే వెల్లడించారు.

అంతేకాదు, తల్లులు బిడ్డకు పాలివ్వడం వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో పెరిగిన బరువు తగ్గుతారట.పాలివ్వడం వల్ల శరీరంలో అదనంగా ఉండే కేలరీలు కరుగుతాయట.ఫలితంగా బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు.ఇక గర్భాదారణ తర్వాత ఎదురయ్యే రక్తస్రావ సమస్యను తగ్గించడంలోనూ తల్లి బిడ్డకు పాలిచ్చే విధానం ఉపయోగపడుతుంది.
అలాగే పాలివ్వడం వల్ల అందం తగ్గుతుందని చాలా మంది తల్లులు భావిస్తారు.కానీ, ఇది అపోహ మాత్రమే.
బిడ్డకు పాలివ్వడం వల్ల అందంలో ఎలాంటి మార్పులు రావని అంటున్నారు.ఇక పాలు ఇచ్చే సమయంలో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయట.
అవి తల్లిలో డిప్రెషన్, ఒత్తడి వంటి సమస్యలను దూరం చేస్తాయట.కాబట్టి, వీలైనంత వరకు ప్రతీ తల్లీ తమ బిడ్డలకు తమ పాలే ఇచ్చేందుకు ప్రయత్నించండి.