ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ ఖేర్ లో దళిత బాలికలైన ఇద్దరు అక్కాచెల్లెలను అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే కఠినంగా శిక్షించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ముందు సావిత్రి బాయి, జ్యోతిరావు పూలే విగ్రహాల వద్ద ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ ఖేర్ ఘటనను నిరసిస్తూ కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో దళితులపైన, దళిత అమ్మాయిలపైన అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరుగుతున్నాయని, వీరికి రక్షణ కల్పించకుండా బీజేపీ పాలక ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే దాడులను ఉసిగొల్పుతున్నట్లు ఆయన విమర్శించారు.
75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో కూడా దళితులపైన, మహిళలపైన, మైనారిటీలపైన పాలకుల ఉదాసీన వైఖరితో వివక్ష చూపుతూ పెత్తందారులకు కొమ్ముకాయడంతో అణగారిన వర్గాల ప్రజలపై ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన దుయ్యబట్టారు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రాజ్యాంగ హక్కులకు రక్షణ కల్పిస్తూ భరోసాను కల్పించాలని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి లకీంపూర్ ఖేర్ దోషులను కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ దళిత బాలికపై మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన దుండగులను తెలంగాణ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శులు బొట్ల సాగర్, మట్టి దుర్గాప్రసాద్, జిల్లా నాయకులు కత్తుల అమరావతి, ఖమ్మం మూడవ పట్టణ నాయకులు ఎస్.కె.సైదులు, పోతురాజు జార్జి, జంగం నగేష్ తదితరులు పాల్గొన్నారు.