సినిమా వాళ్ళని ప్రేక్షకలోకం ప్రత్యేకంగా చూస్తుంది.ఆకాశం నుంచి ఊడిపడినట్టు కనిపిస్తారు.
సాధారణ మనుషుల్లా మనలో తిరగరు, మనకి అందనత్త ఎత్తులో ఉంటారు.అందుకే వాళ్ళని తారలు అంటారు.
అయితే ఒకప్పుడు ఆకాశమంత ఎత్తులో తారల్లా మెరిసిన నటులు ఒకానొక సమయంలో నేలరాలిన సందర్భాలు ఉన్నాయి.బండ్లు ఓడలయినట్టు, ఓడలు బండ్లు అయినట్టు సినిమా వాళ్ళ జీవితాలు ఎప్పుడు తలకిందులవుతాయో తెలీదు.
ఒకప్పుడు దర్జాగా బతికిన వారు చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితికి వచ్చేస్తారు.
అలాంటి వారిలో హాస్యనటుడు కస్తూరి శివరావు ఒకరు.అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు లాంటి హీరోల స్థాయిలో మాస్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక నటుడు శివరావు.1948 లో వచ్చిన బాలరాజు సినిమాతో ఈయన పెద్ద స్టార్ అయిపోయారు.ఆ తర్వాత వరుస సినిమాలు, చేతి నిండా డబ్బులు, మద్రాస్ లో సొంత ఇల్లు, విదేశీ కారులో తిరిగేవారు.అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.ఆయనకి అవకాశాలు తగ్గాయి.సంపాదించుకున్న ఆస్తులు ఏమయ్యాయో తెలీదు పాండి బజార్ లో విదేశీ కార్ లో తిరిగిన శివరావు చివరకి, డొక్కు సైకిల్ మీద తిరుగుతూ అతి సాధారణ జీవితం గడిపారు.
చిత్తూరు నాగయ్య తెలుగునాట మహానటుడు.తెలుగులో తొలిసారిగా లక్ష రూపాయల పారితోషికం తీసుకున్నారు.అప్పట్లో అది రికార్డ్.డిమాండ్ ఉన్న నటుడు కావడంతో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండేవారు.మద్రాస్ లో కోడంబాకంలో పెద్ద తోటలు, టి.నగర్ లో ఇళ్లూ ఉండేవి.విద్యాశాలల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, టి.నగర్ లో వాణిమహల్ నిర్మాణాలకి ఇలా విరాళాలు ఇస్తూ, దాన ధర్మాలు చేసేవారు.మధ్యలో నిర్మాతగా మారి సినిమాలు తీశారు.కొందరిని నమ్మి మోసపోయారు.అలా ఆస్తులు కరిగిపోయాయి.చివరకి సొంత ఇంటి నుంచి అద్దె ఇంట్లోకి రావాల్సి వచ్చింది.
చేతిలో పైసా లేకుండా అత్యంత దయనీయ స్థితిలో బతికారు.
మహానటి సావిత్రిది కూడా ఇదే పరిస్థితి.ఆమె కాల్షీట్ల కోసం డైరెక్టర్లు, నిర్మాతలు క్యూలు కట్టేవారు.అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా రికార్డ్ సృష్టించారు.
అప్పట్లో విలాసవంతమైన భవనం, కార్లు, నిత్యం డబ్బులతో కళకళలాడుతూ ఉండేవారు సావిత్రి.అప్పట్లో ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే బ్లాంక్ చెక్ ఇచ్చేవారంటే అర్ధం చేసుకోవచ్చు.
సావిత్రి ఎంత పెద్ద ధనవంతురాలో.అయితే అలా బ్లాంక్ చెక్ లు ఇవ్వడం మంచిది కాదని ఏఎన్నార్ లాంటి పెద్దలు చెప్పారు.
కానీ అంతలోనే సావిత్రి జీవితం మలుపు తిరిగిపోయింది.తన జీవితంలో ఎన్నో బాధలు అనుభవించారు.
డబ్బు, బంగారం, హోదా ఇలా అన్నీ ఉన్నా మానసిక ప్రశాంతత లేదు.భర్తతో గొడవల కారణంగా ఆమె చాలా డిస్టర్బ్ అయ్యారు.
ఆ బాధతో వ్యసనాలకు బానిస అయ్యారు.అలా ఆమె జీవితాన్ని చేతులారా పాడు చేసుకున్నారు.
ఇన్ని బాధల్లోనే దాన ధర్మాలు చేసేవారు.ప్రతీ ఒక్కరినీ నమ్మేవారు.
అలా తన ఆస్తిని మొత్తం పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చేశారు.మహానటిగా, నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగిన సావిత్రి, ఆఖరి రోజుల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ గడిపారు.
అలా ఆమె మనోవేదనతో కోమాలోకి వెళ్ళిపోయారు.కోమాలోంచి బయటకు వచ్చిన కొన్ని రోజులకి ఆమె చనిపోయారు.
ఇలా చాలా మంది ఒకప్పుడు మహారాజుల్లా, మహారాణుల్లా బతికి చివరి రోజుల్లో ఏమీ లేక చాలా కష్టాలు అనుభవించారు.కానీ వీళ్ళ జీవితాలు ఇప్పటి తరం నటులు గుణపాఠంగా తీసుకుని జాగ్రత్తగా బతుకుతున్నారు.