విజయవాడ నగర కార్పొరేషన్ ఎన్నికలకు ప్రచార జోరు కొనసాగుతోంది.ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి.
అయితే టీడీపీ తరఫున కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కమ్మ సామాజిక వర్గానికి కేటాయించారు (దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి).గత ఎన్నికల్లోనూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన కోనేరు శ్రీధర్ కు కేటాయించారు.
ఇక, ఇప్పుడు ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతకు ఇస్తామనిగత ఏడాది చంద్రబాబు ప్రకటించారు.అయితే ఇప్పుడు ఇదివివాదంగా మారిన నేపథ్యంలో చివరి నిముషం వరకు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.
ఇదిలావుంటే అధికార పార్టీ వైసీపీ విజయవాడ కార్పొరేషన్‌లో పాగా వేయాలని నిర్ణయించుకుంది.మిగిలిన కార్పొరేషన్ల సంగతి ఎలా ? ఉన్నా ఇక్కడ గెలవడం జగన్‌కు అసలు సిసలు పరీక్షగా మారింది.ప్రధాన సమస్యలుగా ఉన్న అమరావతి రాజధాని అభివృద్ధి సహా అనేక సమస్యలు పార్టీని వేధిస్తున్నాయి.ఇక, నాయకులు ఉన్నప్పటికీ ఆధిపత్య ధోరణి కొనసాగుతోంది.
ఎన్ని సమస్యలు ఉన్నా ఎలాగైనా ఇక్కడ మేయర్ స్థానం దక్కించుకుని మూడు రాజధానులకు ప్రజలు ఓకే చెప్పారనే సంకేతాలు ఇవ్వాలని జగన్ సర్కారు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది.

అయితే మేయర్ పీఠాన్ని ఎవరికి అప్పగిస్తారనే చర్చ ఒకవైపు సాగుతున్నా ప్రస్తుతానికి రెడ్డి సామాజిక వర్గానికే దీనిని కేటాయించినట్టు అంతర్గతంగా చర్చ నడుస్తోంది.అవినాష్ కోసం తూర్పు సీటు వదులుకున్న పార్టీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ( కమ్మ నేత)కు హామీ ఇచ్చినట్టు ముందు వార్తలు వచ్చినా వారి కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఎన్నికల బరిలో లేరు.టీడీపీ కమ్మ సామాజిక వర్గానికి మేయర్ పదవి ఇస్తుందన్న వార్తలతో ఆ వర్గం వాళ్లకే వైసీపీ కూడా మేయర్ ఇస్తుందన్న అంచనాలు నిన్నటి వరకు ఉన్నా తాజాగ అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు.
ఇప్పుడు జగన్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పుకొనే పూనూరు గౌతం రెడ్డి తనకుమార్తెను మేయర్ పీఠంపై కూర్చోబెట్టేందుకు గౌతంరెడ్డి పావులు కదుపుతున్నారు.ఆయనకు పార్టీలోని కీలక రెడ్డి నేతల నుంచి హామీ లభించినట్టు సమాచారం.
మంత్రి వెల్లంపల్లి మాత్రం మరో రెడ్డి వర్గం మహిళా నేతను మేయర్ చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు.జగన్ మాత్రం మాజీ కార్పొరేటర్ పుణ్యశీల కార్పొరేషన్లో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫైట్ చేసిన నేపథ్యంలో ఆమెకు హామీ ఇచ్చారని ఆమె వర్గం చెప్పుకుంటోంది.
ఏదేమైనా పక్కనే ఉన్న గుంటూరు మేయర్ పదవి కాపు వర్గం నేత కావటి మనోహర్ నాయుడుకు ఖరారైందన్న నేపథ్యంలో బెజవాడలో కమ్మ మేయర్ ఉంటాడని ఆశలు పెట్టుకున్న వైసీపీ కమ్మ నేతలకు షాక్ తప్పేలా లేదు.