ఏపీ, తెలంగాణల మధ్య మరో వివాదం రాజుకుంది.తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులో ఐఏఎస్ అధికారులు నివాసముంటున్న సర్కారీ భవనాలు (క్వార్టర్ల) విషయంలో నెలకొన్న ఈ వివాదంలో నిన్న ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ (ఏపీ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి) ఉంటున్న క్వార్టర్ తమదేనని వాదిస్తున్న తెలంగాణ ప్రభుత్వం నిన్న ఆ క్వార్టర్ వద్దకు తన సిబ్బందిని పంపింది.తక్షణమే క్వార్టర్ ను ఖాళీ చేయాలని తెలంగాణ సిబ్బంది చేసిన హెచ్చరికలను పీవీ రమేశ్ బేఖాతరు చేశారు.క్వార్టర్ ను ఖాళీ చేయకుంటే…కరెంటు, నీటి సరఫరాను నిలిపివేస్తామని తెలంగాణ సిబ్బంది చెప్పగా, ఎలా నిలిపేస్తారో చూస్తానంటూ పీవీ రమేశ్ కూడా వారికి ఘాటుగా సమాధానమిచ్చారు.
వివరాల్లోకెళితే… రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్ర కేడర్ లోని పీవీ రమేశ్ ఏపీ కేడర్ అధికారిగా మారిపోయారు.2014 ఫిబ్రవరి 15న రాష్ట్ర విభజన నోటిఫికేషన్ జారీ అయ్యింది.అయితే 2014, ఫిబ్రవరి 14న పీవీ రమేశ్ ప్రస్తుతం తానుంటున్న క్వార్టర్ కు మారిపోయారు.
విభజన చట్టం ప్రకారం… రాష్ట్ర విభజనకు ముందు ఐఏఎస్ అధికారులు వారు ఉంటున్న ప్రభుత్వ భవనాల్లో రిటైర్ అయ్యేదాకా వాటిలోనే ఉండేలా ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.అయితే పీవీ రమేశ్ ఉంటున్న క్వార్టర్ తమకే చెందుతుందని తెలంగాణ వాదిస్తోంది.
దీంతో సదరు క్వార్టర్ ను ఖాళీ చేయాలని ఆరు నెలలుగా ఆయనకు తెలంగాణ నోటీసులు జారీ చేస్తూ వస్తోంది.
అయితే ఈ నోటీసులకు పీవీ రమేశ్ ఏమాత్రం స్పందించలేదు.
దీంతో నిన్న తెలంగాణ ప్రభుత్వం ఎస్టేట్ డిపార్ట్ మెంటుకు చెందిన కొంతమంది సిబ్బందిని పీవీ రమేశ్ క్వార్టర్ వద్దకు పంపింది.తెలంగాణ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టిన పీవీ రమేశ్… తాను ఉంటున్న క్వార్టర్ ఎంసీహెచ్ ఆర్డీకి చెందినదని చెప్పారు.
పదో షెడ్యూల్ సంస్థల కిందకు వచ్చే ఎంసీహెచ్ఆర్డీ విభజన ఇంకా పూర్తి కాలేదని, ఈ నేపథ్యంలో ఆ సంస్థకు చెందిన క్వార్టర్ తెలంగాణకు ఎలా చెందుతుందని ప్రశ్నించారు.నిబంధనల ప్రకారం తాను ఉంటున్న క్వార్టర్ లో తాను పదవీ విరమణ పొందేదాకా నివాసముండే హక్కు తనకుందని చెప్పిన పీవీ రమేశ్… క్వార్టర్ ను ఖాళీ చేసే ప్రసక్తే లేదని తేల్చేశారు.
దీంతో చేసేదేమీ లేక తెలంగాణ ఎస్టేట్ సిబ్బంది వెనుదిరిగారు.