యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రసవత్తర పోటీ నెలకొంది.బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయంటూ పైళ్ల శేఖర్ రెడ్డి(బీఆర్ఎస్) ధీమాగా ఉండగా,ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల వచ్చిన వ్యతిరేకత,కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలే తనకు విజయాన్ని తెచ్చి పెడతాయని కుంభం అనిల్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్) విశ్వాసంతో ఉన్నారు.
గెలుపు తమదంటే తమదేనని ఇరువురు అభ్యర్దులు ముమ్మరంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఇదిలా ఉంటే 2018 ఎన్నికల్లో పైళ్ల శేఖర్ రెడ్డి 49.34శాతంతో 85,476 ఓట్లు సాధించి గెలుపొందగా,కుంభం అనిల్ కుమార్ రెడ్డి 35.45 శాతంతో 61,413 ఓట్లు సాధించి ఓటమి చెందారు.గత ఎన్నికల్లో భువనగిరి పట్టణం నుంచి అనుకున్న మొత్తంలో ఓట్లు పడకపోవడంతోనే ఓడిపోయినట్లు గ్రహించిన కుంభం ఈ సారి భువనగిరి పట్టణ ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది.వలిగొండ మండలంలో కాంగ్రెస్ బలంగా ఉండడం, కుంభం సొంత మండలం కావడంతో అత్యధిక ఓట్లు వచ్చే అవకాశం ఉందని, పోచంపల్లి,బీబీనగర్ లో కాంగ్రెస్,బీఆర్ఎస్ పోటాపోటీగా తలపడనున్నాయని అంచనాలు వేస్తున్నారు.
అయితే బీఆర్ఎస్,కాంగ్రెస్ మధ్య జరిగే హోరాహోరీ పోరులో బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి చీల్చే ఓట్లే కీలకంగా మారనున్నాయని టాక్ నడుస్తోంది.గూడూరు సొంత మండలం బీబీనగర్,భువనగిరి టౌన్ లో బీజేపీకి ఉన్న ప్రత్యేక ఓటు బ్యాంకు కుంభం,పైళ్ల ను కలవరపెడుతున్నాయి.
బీజేపీ అభ్యర్థి ఏ మేరకు ఓట్లు చీలుస్తారు?బీజేపీ ఓటు బ్యాంకు ద్వారా ఎవరికీ లాభం, ఎవరికీ నష్టం కలుగుతుందని బీఆర్ఎస్,కాంగ్రెస్ శ్రేణులు లెక్కలు వేసుకుంటూ,ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.దీనితో బీజేపీ చీల్చే ఓట్లే భువనగిరి భవితవ్యం నిర్ణయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.