నల్లగొండ జిల్లా: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయితీ కార్మికులు గత 22 రోజులుగా తమ హక్కుల కోసం సమ్మె చేస్తున్నారని,ప్రభుత్వం వారిపట్ల సానుకూలంగా స్పందించాలని రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయితీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని స్థానిక నల్లగొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 22 రోజులుగా 12,700 మంది గ్రామపంచాయితీ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్న మూలంగా గ్రామాలలో అపరిశుభ్రమైన వాతావరణం ఏర్పడిందన్నారు.
ప్రభుత్వం స్పందించి వారిని చర్చలకు పిలువాలని,పంచాయితీ కార్మికులు గొంతమ్మ కోరికలు కోరడం లేదు అన్నారు.సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వారు చేస్తున్న పనికి తగ్గట్లుగా వేతనం ఇవ్వాలని కోరుతున్నారన్నారు.
మల్టీపర్పస్ పేరుతో కార్మికులను ఇష్టారాజ్యంగా వాడుకొవడం రాజ్యాంగ నియమ నిబంధనలకు వ్యతిరేకమన్నారు.ఆ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.
పల్లెలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుతున్న గ్రామపంచాయితీ కార్మికులు అతి తక్కువ వేతనానికి సకల పనులు చేయించడం వెట్టిచాకిరి కాదా అన్నారు.గ్రామ స్వరాజ్యం వెల్లివిరియాలంటే గ్రామపంచాయతీ కార్మికులను అక్కున చేర్చుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
వారిని పర్మినెంట్ చేసి బాధ్యతాయుతమైన ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.
కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ పంచాయితీ కార్మికులు గొంతమ్మ కోరికలు కోరడం లేదన్నారు.
వారి న్యాయమైన డిమాండ్లు ఐన కార్మికులు,సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని,ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలని,పీఆర్‌సీలో నిర్ణయించిన ప్రకారం నెలకు 19 వేల వేతనం చెల్లించాలన్నారు.జీఓ 51ని సవరించి మల్టీపర్సస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు.విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వాలని,8 గంటల పనిదినాలు అమలు చేయాలన్నారు.పండుగ సెలవులు, వారాంతపు సెలవు, జాతీయ అర్జిత సెలవులు అమలు చేయాలన్నారు.
సిబ్బందిపై వేదింపులు, అక్రమ తొలగింపులు ఆపాలన్నారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్.లక్ష్మీనారాయణ,రిటైర్డ్ ఏఎస్డబ్ల్యూ కత్తుల శశాంక్, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.వెంకులు, కుర్షిద్ మియా, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు,పివైఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఇందూరి సాగర్,ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భిక్షపతి, ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, ఉమారాణి,భూతం అరుణ, మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్,వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ గంజి మురళి,సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు బొంగరాల నరసింహ,గాదె నరసింహ, కొండా వెంకన్న,పోలే సత్యనారాయణ,బొల్లు రవీందర్,ఒంటెపాక యాదగిరి,పరిపూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు.