నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ ( Narendra Modi )అమెరికాకు వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటికే న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే ( International Yoga Day )కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు.
ఇక ప్రధాని పర్యటనలో కీలక ఘట్టం మరికొద్దిగంటల్లో ప్రారంభం కానుంది.అమెరికా కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు.
అంతేకాదు.యూఎస్ కాంగ్రెస్‌లో రెండు సార్లు ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ రికార్డుల్లోకెక్కనున్నారు.
ఈ క్రమంలో ఆయన ఏం మాట్లాడతారోనని భారత్, అమెరికాలతో పాటు యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

అయితే అమెరికాకు చెందిన పలువురు చట్టసభ సభ్యులు మోడీ కార్యక్రమానికి దూరంగా వుంటున్నట్లు ప్రకటించారు.భారత్‌లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మైనారిటీలను అణచివేస్తోందని ఆరోపిస్తూ.చట్టసభ సభ్యులు ఇల్హాన్ ఒమర్, రషీదా త్లైబ్, అలెగ్జాండ్రియా ఒకాసియో- కోర్టెజ్, జామీ రాస్కిన్‌లు యూఎస్ కాంగ్రెస్‌లో జరిగే కార్యక్రమానికి గైర్హాజరవుతున్నట్లు తెలిపారు.
మోడీ ప్రభుత్వం హింసాత్మక హిందూ జాతీయవాద సమూహాలను ప్రోత్సహిస్తోందని చట్టసభ సభ్యులు ఆరోపిస్తున్నారు.పత్రికా స్వేచ్చ, మైనారిటీ మతపరమైన హక్కులపై పరిమితులు, ఇతర రకాల వివక్ష వంటి అంశాలపై వారు విమర్శలు గుప్పిస్తున్నారు.

కాగా.డెమొక్రాటిక్ పార్టీకి చెందిన 75 మంది సెనేటర్లు, ప్రతినిధుల సభ సభ్యులు మోడీతో మానవ హక్కుల సమస్యలపై చర్చించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు.తాము ఏ భారతీయ నాయకుడిని, రాజకీయ పార్టీని ఆమోదించమని.కానీ అమెరికన్ విదేశాంగ విధానంలో ప్రధాన సూత్రాలకు మద్ధతుగా నిలుస్తామని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.ఒమర్, త్లైబ్, ఓకాసియో కోర్టెజ్‌లు మోడీ ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు.రాస్కిన్ తన కుమార్తె వివాహం కారణంగా, ఆ లేఖపై సంతకం చేయనప్పటికీ కాంగ్రెస్ సమావేశానికి హాజరుకాలేనని స్పష్టం చేశారు.