రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలవడానికి వైకాపా పార్టీ తప్పుడు విధానాలను అవలంబిస్తున్నదని మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు .13వ తారీకున జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు మరియు కార్యకర్తలను ఉద్దేశించి టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడటం వైకాపా ప్రభుత్వానికి అలవాటేనని ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలవడానికి కూడా ఇదే విధానాల్ని అవలంబిస్తుందని దుయ్యబట్టారు ఇప్పటికే వేలకొద్దీ బోగస్ ఓట్లు బయటపడుతున్నాయని, అర్హత లేని వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వడం వేరే నియోజకవర్గం వారికి ఇక్కడ ఓటు పుట్టించడం లాంటి అనైతిక కార్యక్రమాలకు జగన్ ప్రభుత్వం పాల్పడుతుందని దీనికి కొంత మంది అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు.వీటన్నిటిని ఎదుర్కొనే విధంగా కార్యకర్తలు నియోజకవర్గ ఇన్చార్జిలు కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
అక్రమాలను ఎక్కడికక్కడ నిలదీయాలని గుర్తించిన బోగస్ ఓట్ల పై ఎప్పటికప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్ల తో పాటు, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదులు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కలిగేలా చేసి తెదేపా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు.ఉత్తరాoధ్ర తూర్పు మరియు పశ్చిమ రాయలసీమలో అభ్యర్థులు బి చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్ మరియు భూమి రెడ్డి రామిరెడ్డి ల విజయానికి కృషి చేయాలని ఆయన తెలిపారు.ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరిగిందని ఉద్యోగులందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని చాలా కాలంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.ప్రభుత్వం అనుసరిస్తున్న చాలా విధానాలు ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నాయని, ప్రభుత్వాన్ని దించడానికి ఉద్యోగులు సంకల్పంతో ఉన్నారని ప్రతిపక్షాలు చాలాసార్లు ఆరోపించాయి జీతాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వం అని విమర్శించాయి.
మరి వారి ఆరోపణలు ఏ మేరకు నిజముందో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సరళి తో ఒక అవగాహనకు రావచ్చు.ఈ ఎన్నికలలోభారీ విజయం సాధించి ప్రతిపక్షాల ఆరోపణలని అబద్ధమని నిరూపించాలని వైకాపా కూడా బలంగా కోరుకుంటుంది .