గత కొన్ని దశాబ్దాల క్రితం వరకు వెండితెరపై ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రమాప్రభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కలిపి సుమారు 1800 పైగా సినిమాలలో నటించినట్టు తెలుస్తోంది.
ఇలా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలో నటించిన రమాప్రభ గత కొంతకాలం నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.అయితే ప్రస్తుతం ఈమె తన సినిమా షూటింగులు జరుపుకున్న ప్రదేశాలు చూడటం కోసం బెంగుళూరుకు వెళ్లారు.
ఇలా బెంగుళూరుకి వెళ్లిన ఈమె సరదాగా మీడియాతో కాసేపు ముచ్చటించారు.ఈ సందర్భంగా మీడియా సమావేశంలో రమాప్రభ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.నటన పరంగా నటిగా తన సినీ కెరీర్లో ఎంతో సంతృప్తిగా ఉన్నానని ఆమె వెల్లడించారు.తెలుగులో తాను చిలకా గోరింక అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చానని తనకు తెలుగులోనే ఎన్నో అద్భుతమైన పాత్రలు వచ్చాయని ఈ సందర్భంగా ఆమె తన సినీ కెరీర్ గురించి గుర్తు చేసుకున్నారు.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి తను ఎంతో రుణపడి ఉన్నానని ఆయన అడిగితే ఇప్పుడు కూడా తన సినిమాల్లో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా రమాప్రభ వెల్లడించారు.ప్రస్తుతం సినిమాలకు దూరం కావడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఎదురవగా తాను ఇప్పుడు కూడా సినిమాలలో నటిస్తే పాత తరాన్ని అవమానించినట్లు అవుతుందని భావించి సినిమాలకు దూరంగా ఉన్నానని, అయితే శబరి వంటి పాత్రలు కనుక వస్తే తప్పకుండా నటిస్తానని ఈ సందర్భంగా రమాప్రభ వెల్లడించారు.