అడుగలడిందు గలడనే సందేహం వలదు ఏ దేశంలో వెతికినా ఆదేశంలో కలడు మన భారతీయుడు అంటూ ఎన్నారైలను మనం కీర్తించుకోవాలి.ఎందుకంటే విదేశాలకు వలసలు వెళ్లి అక్కడ మనదైన ప్రతిభతో ఉన్నత స్థానాలలో కొలువు దీరుతున్నారు.
ముఖ్యంగా అగ్ర రాజ్యం అమెరికాకు వలస వెళ్ళిన వారిలో భారతీయులే అత్యధికంగా ఉంటారు.అలాగే అక్కడ పలు కీలక విభాగాలలో, రంగాలలో భారతీయుల హవా ఇప్పటికి ఎప్పటికి కొనసాగుతూనే ఉంటుంది.
బిడెన్ వచ్చిన తరువాత ప్రభుత్వంలో పదవులు కట్ట బెట్టడంలో మన వారికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
అలాగే అమెరికా తరువాత ఆ స్థాయిలో భారతీయులకు ప్రాధ్యాన్యత ఇస్తున్న దేశం బ్రిటన్.
ఈ దేశంలో సైతం అత్యధిక వలస వాసులు భారతీయులు కావడం గమనార్హం.అమెరికా కాదనుకుని బ్రిటన్ వెళ్ళే వారి సంఖ్య ఈ మధ్య కాలంలో రెట్టింపు అవుతోంది కూడా.
ఇక మరో దేశంలో కూడా భారతీయులు తమదైన ముద్రతో దూసుకు పోతున్నారట.ఆస్ట్రేలియన్ ఇండియన్ డయాస్పోరా ఏ నేషనల్ అసెట్ పేరుతో విడుదలైన ఓ నివేదిక ఆస్ట్రేలియా దేశంలో భారతీయులు ఏ స్థాయిలో వెలిగి పోతున్నారో తెలిపింది.
ఆస్ట్రేలియాకు వలస వచ్చిన వారితో పోల్చితే భారత్ రెండవ స్థానంలో ఉందట.ముఖ్యంగా ఆస్ట్రేలియాలో స్థానికుల కంటే కూడా భారతీయుల ప్రాభల్యం ఎక్కువగా ఉందని, సదరు నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో సుమారు 7 లక్షలకు పైగా భారతీయ ఎన్నారైలు ఉండగా వారందరూ జాతీయ సంపద అంటూ ఈ నివేదిక ప్రకటించింది.ఆస్ట్రేలియన్స్ విద్య ప్రమాణాలతో పోల్చితే భారతీయుల విద్యార్హతలు, ఉద్యోగావకాశాలు, వ్యాపార రంగంలో దూసుకు పోతున్నారని తెలిపింది.
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాలోని సుమారు 996 కంపెనీలలో భారత సంతతికి చెందిన వారు బోర్డ్ డైరెక్టర్ లుగా, మెంబర్స్ గా పలు రంగాలలో కీలక స్థానాలలో పదవులు అధిరోహిస్తున్నారని నివేదిక వెల్లడించింది.