తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.దీనికోసం రకరకాల పోరాట మార్గాన్ని ఎంచుకుని అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు, బీజేపీ పైన రకరకాల మార్గాల్లో పోరాటం చేస్తూ వస్తున్నారు.
అయితే ప్రధాన పార్టీల్లోని రాజకీయ ప్రత్యర్థుల కంటే ఎక్కువగా సొంత పార్టీలోని నాయకులు రేవంత్ కు శత్రువులుగా మారి అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తూనే వస్తున్నారు.అయినా రేవంత్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా అందరినీ కలుపుకొని వెళ్లేందుకు గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి స్ఫూర్తి పొందినట్టు కనిపిస్తున్నారు.
రాజశేఖర్ రెడ్డి సీఎం గా పనిచేసిన సమయంలో కాంగ్రెస్ సీనియర్లు చాలామంది అధిష్టానం దగ్గర తమ పలుకుబడి ఉపయోగించి రకరకాల మార్గాల్లో ఆయనపై ఒత్తిడి పెంచే వారు.
అయినా రాజశేఖర్ రెడ్డి మాత్రం అందరినీ కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు.ఆ దిశగా ఆయన సక్సెస్ అయ్యారు.
ఇప్పుడు అదే ఫార్ములాను రేవంత్ సైతం ఫాలో అవ్వాలని, తనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసినా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరినీ కలుపుకొని వెళ్లాలని డిసైడ్ అయిపోయారు.రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ వద్ద మాత్రమే పలుకుబడి ఉంది.
సోనియా దగ్గర చక్రం తిప్పే అంత స్థాయి రేవంత్ కు లేకపోవడం , అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాలామంది సోనియాతో నేరుగా మాట్లాడగలిగే వారు, ఫిర్యాదులు చేయ గలిగిన వారు చాలామంది ఉండటం వంటి కారణాలతో సీనియర్లను సైతం కలుపుకుని వెళ్లాలని, వారు తనపై అసంతృప్తితో ఉన్నా, వారిని ఏదో రకంగా తన దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు.
బహిరంగంగానే తనపై విమర్శలు చేస్తూ అసంతృప్తితో ఉండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారిని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.అలాగే మిగిలిన సీనియర్ నాయకుల అభిప్రాయాలకు గౌరవం ఇస్తూ, వారికి తాను ఎప్పుడు ప్రాధాన్యం ఇస్తాననే సంకేతాలను రేవంత్ ఇస్తున్నారు.