తెలంగాణ బీజేపీ లో చేరికలు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ , కాంగ్రెస్ నుంచి అసంతృప్తి నేతలను పార్టీలు చేర్చుకుంటూ బీజేపీ 2023 ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
దీనిలో భాగంగానే చేరికలకు పెద్దఎత్తున ప్రోత్సాహకాలు కల్పిస్తూ ఉండడంతో ఇతర పార్టీల నుంచి వచ్చే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది .కొత్త వారి పై పార్టీ సీనియర్ లీడర్ లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.దీనికి కారణం పార్టీలో కొత్తగా చేరిన వారికి పెద్దగా బలగం లేకపోయినా , పార్టీలో వారికి పెద్దపీట వేస్తున్నారని, వారికి జెండాలు తామే కట్టాల్సి వస్తోందని, పైగా వారు తమపై పెత్తనం చేస్తూ, తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అయినా పార్టీ లో కొత్తగా చేరిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉందని సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.
కొత్తగా పార్టీలో చేరే వారు పెద్ద ఎత్తున అనుచరులను తీసుకొచ్చి బీజేపీలో చేర్చినా ఫర్వాలేదు కానీ , కొంతమంది ఒక్కరే వచ్చి పార్టీలో చేరుతున్నారని, వారి వెంట క్యాడర్ రావడం లేదని, అయినా వారికి మంచి గుర్తింపు లభిస్తోందని, దశాబ్దాలుగా ఎన్నో కష్టాలను భరిస్తూ పార్టీ జెండా మోసిన తమకు ఎటువంటి ప్రాధాన్యం దక్కడం లేదని , మొదటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నారట.
ప్రస్తుతం ఈ వ్యవహారంపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.ఇటీవల జరిగిన బీజెేపీ రాష్ట్ర కార్యవర్గ పదాధికారుల సమావేశంలో ఈ అసంతృప్తులు బయటపడ్డాయి.ఓ సీనియర్ నేత పార్టీలో జరుగుతున్న వ్యవహారాల పైన, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తుండడం పైనా రాష్ట్ర నాయకత్వం సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో సైలెంట్ గా ఉండి పోయినట్లు సమాచారం.ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ లో కాస్త ఊపు కనిపిస్తోంది.

దుబ్బాక , హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపు దక్కడంతో పార్టీలోనూ జోష్ పెరిగింది. ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరేందుకు వస్తున్నారు. అయితే అలా వచ్చిన వారికి పార్టీ కీలక పదవులు ఇవ్వడం, ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉండటం పైనే సీనియర్ నేతలు అసంతృప్తి కారణంగా తెలుస్తోంది.