ఎన్నో తెలుగు సినిమాలలో అద్భుతమైన పాత్రలో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్య సమస్యల కారణంగా అపోలో ఆస్పత్రిలో చేరారు.ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
గత కొద్ది రోజుల క్రితం కైకాల సత్యనారాయణ ఇంట్లో కాలుజారి కింద పడటంతో సికింద్రాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా మరోసారి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వల్ల జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలియజేశారు.ఈ క్రమంలోనే ఈయన ఆస్పత్రిలో చేరిన విషయం తెలియడంతో పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
1959వ సంవత్సరంలో సిపాయి కూతురు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కైకాల సత్యనారాయణ సినీ కెరీర్ లో సుమారు 700 చిత్రాలకు పైగా నటించారు.గత ఆరు దశాబ్దాల కాలం నుంచి ఈయన ఇండస్ట్రీలో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ పొందారు.నాటి తరం ప్రేక్షకులను మాత్రమే కాకుండా ప్రస్తుత సినిమాలలో కూడా తండ్రి తాత పాత్రలో నటిస్తూ ఈ తరం వారికి కూడా అభిమాన నటుడిగా మారిపోయారు.అలాంటి కైకాల అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరడంతో క్షేమంగా బయటకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.