వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లేవారికి అమెరికాయే తొలి డెస్టినేషన్.అలా శతాబ్ధాలుగా ఎన్నో జాతులు, వర్గాలు, మతాల వారిని అక్కున చేర్చుకుంది అమెరికా.
తనపర బేధాలు లేకుండా అందరికీ ఆశ్రయం కల్పించింది.జీవన ప్రమాణాలు, ఆరోగ్య వసతులు, ఉపాధి, విద్య ఇలా అన్నింట్లో మెరుగ్గా వుండటంతో వివిధ దేశాల ప్రజలకు అమెరికా అంటే వ్యామోహం నానాటికీ పెరుగుతోంది.
అన్ని రకాలుగా ప్రోత్సహం లభించడంతో పాటు అగ్రరాజ్యంలోని అత్యున్నత పదవులను విదేశీ పౌరులు చేజిక్కించుకుంటున్నారు.సమర్ధత, మేధస్సు, అనుభవం వుంటే చాలు అమెరికన్లు అందలమెక్కిస్తున్నారు.
ఇందుకు ఎన్నో ఉదాహరణలు.భారతీయులు, చైనీయులు, కొరియన్లు, జపనీయులు, ఆఫ్రికా ఖండాల వారు అక్కడ రాణిస్తున్నారు.
వీరి విజయ గాథలు కూడా మిగిలిన వారికి అమెరికా అంటే మక్కువ కలిగేలా చేస్తోంది.
తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో పాక్ సంతతి వ్యక్తి చరిత్ర సృష్టించాడు.
దేశంలోనే తొలిసారిగా ఫెడరల్ జడ్జిగా ఎంపికయ్యారు.ఆయన నియమకానికి సంబంధించి అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయంతో అమెరికాలో మొట్టమొదటి ముస్లిం–అమెరికన్ ఫెడరల్ జడ్జిగా పాకిస్తాన్ సంతతికి చెందిన జాహిద్ ఖురేషీ (46) నియమితులయ్యారు.న్యూజెర్సీలోని జిల్లా కోర్టులో ఆయన న్యాయమూర్తిగా విధులు నిర్వహించనున్నారు.
ఖురేషీ ఎంపిక కోసం జరిగిన ఓటింగ్ సందర్భంగా సెనెట్ 81–16 ఓట్లతో ఆమోదం తెలిపింది.ఈ ఓటింగ్‌లో దాదాపు 34 మంది రిపబ్లికన్లు డెమొక్రాట్లకు మద్ధతుపలకడం గమనార్హం.
దీనిపై సెనెటర్ రాబర్ట్ మెనెండెజ్ స్పందిస్తూ.ఖురేషీ దేశానికి సేవ చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నారని కొనియాడారు.
ఆయన నియామకం ద్వారా అమెరికాలో ఏదైనా సాధ్యమే అని మరోసారి రుజువైందన్నారు.

కాగా, 2019లో ఖురేషీ న్యూజెర్సీలోని ఓ కోర్టుకు మేజిస్ట్రేట్‌గా ఎంపికయ్యారు.ఖురేషీ ఎంపికపై అమెరికాలోని ఇస్లాం వర్గాలు హర్షం వ్యక్తం చేస్తుండగా, పాకిస్తాన్లో సంబురాలు చేసుకుంటున్నారు.46 ఏళ్ల ఖురేషీ 2004, 2006లో ఇరాక్‌లో పర్యటించాడు.అంతేకాదు ఆయన తండ్రి కూడా గతంలో ప్రాసెక్యూటర్గా పని చేశాడు.
మరోవైపు జో బిడెన్ తన కొలువులో ముస్లింలకు కీలక బాధ్యతలు అప్పగిస్తూనే వున్నారు.
స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి దిలావర్ సయ్యద్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ విభాగానికి లీనా ఖాన్‌లను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.తాజాగా జాహిద్ ఖురేషిని న్యాయయూర్తిగా ఎంపిక చేయడం పట్ల ముస్లింలను అత్యున్నత పదవుల్లో నియమించేందుకు వున్న అడ్డంకులను బైడెన్ అధిగమించినట్లయ్యింది.