అధికారంలోకి వస్తూనే కరోనా అంతమే తన మొదటి లక్ష్యయమన్నారు జో బైడెన్. అందుకు తగ్గట్టుగానే 100 రోజుల్లో 10 కోట్ల డోసుల టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అధికార యంత్రాంగం సమర్థంగా పనిచేయంతో.మార్చి 25 నాటికి, అంటే 64 రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని అందుకున్నారు.
దీంతో బైడెన్ తన లక్ష్యాన్ని 20 కోట్లకు పెంచారు.దాన్ని కూడా 10 రోజుల ముందే.
అంటే 90 రోజుల్లోనే ఛేదించారు.ఫలితంగా.ఒకప్పుడు రోజుకు 3.07 లక్షల కేసులు, రోజుకు దాదాపు 4,500 మరణాలతో వణికిపోయిన అమెరికా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది.దీనితో పాటు ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కోవిడ్-19పై పోరులో భాగంగా అమెరికా కీలక మైలురాయిని అందుకుంది.ఇకపై రెండు డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) శుక్రవారం స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంపై అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు.కరోనాపై సుదీర్ఘ పోరాటంలో ఇదో గొప్ప రోజు అని ఆయన వ్యాఖ్యానించారు.ఏడాదిన్నరగా మాస్క్‌లు ధరించాలని ప్రజలకు పదే పదే సూచించిన సీడీసీ తాజాగా నిబంధనలు సవరించడాన్ని బైడెన్ స్వాగతించారు.రెండు డోస్‌ల వ్యాక్సిన్ పూర్తయిన వారు ఇకపై బహిరంగ, అంతర్గత కార్యకలాపాల్లో పాల్గొన్న సమయంలో మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించాల్సిన అవసరం లేదని సీడీసీ తెలిపింది.
అయితే దీనికి సంబరపడొద్దని కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకు వ్యాక్సినేషన్‌ను మరింత ఉద్ధృతంగా నిర్వహిస్తామని బైడెన్ ప్రకటించారు.దేశంలో ఇన్ని కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మెజారిటీ అమెరికన్లను ఇంకా కొన్ని భయాలు వెంటాడుతున్నాయి.ముఖ్యంగా అక్కడి 18 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న అమెరికన్లలో ఇంకా సగం మంది టీకా తీసుకోలేదు.వ్యాక్సిన్ వల్ల యువతీ, యువకుల్లో సంతాన సామర్ధ్యం తగ్గిపోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడమే వారి భయానికి కారణం.మే ఆరంభంలో జరిపిన ఓ అధ్యయనంలో మూడింట రెండు వంతుల మంది టీకాను వేసుకుంటే సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుందేమో అని భయపడుతున్నట్లు తేలింది.18 నుంచి 49 సంవత్సరాల వయసు గల స్త్రీలలో 50 శాతం, పురుషులలో 47 శాతం మందిలో ఇలాంటి ఆందోళనలు మొదలైనట్లుగా సర్వే వెల్లడించింది.ఈ కారణం చేత ఆ వయసు గలవారు టీకాలు వేయించుకోవడానికి ముందుకు రావడంలేదని అధ్యయనంలో తేలింది.అయితే వ్యాక్సిన్లు తీసుకుంటే సంతానం కలగదు అనడానికి ఆధారాలు ఏమీ లేవని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు.
మరి ఈ సమస్యను అధ్యక్షుడు జో బైడెన్ ఏ విధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి.