తాను ఎన్నో ఊహించుకుని రాజకీయాల్లోకి వచ్చానని కానీ తన ఆశలన్ని జనసేన పార్టీ అడియాసలు చేసిందన్న బాధలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ ఉన్నారు.ముఖ్యంగా జనసేన అధినేత పవన్ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.
జనసేన జె డి ఒక్కరే కాకుండా చాలామంది అసంతృప్తిగా ఉన్నారు.పార్టీ క్షేత్రస్థాయిలో బలపడకపోవడం, నిలబడలేని పవన్ వైఖరి కారణంగా చాలామంది ఇప్పటికీ పార్టీకి దూరమయ్యారు.
ఇంకా పార్టీలో కొనసాగుతున్న వారు అసంతృప్తిగా రాజకీయాలను వెళ్లదీస్తున్నారు.ఇక పవన్ రాజకీయంగా వేస్తున్న అడుగులు ఆ పార్టీ నేతలు ఎవరికి అర్థం కావడం లేదు.
ఈ విషయంలో ముఖ్యంగా లక్ష్మీనారాయణ చాలా అసంతృప్తితో ఉన్నారు.
సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా గతంలో ఏపీ లో పనిచేసిన లక్ష్మీనారాయణ ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
ఆ తరువాత మహారాష్ట్ర క్యాడర్ కు బదిలీ అయిపోవడం, తన ఉద్యోగానికి రాజీనామా చేయడం, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగిపోయాయి.ఆయన పార్టీ పెడతారనే ప్రచారం కూడా జరిగింది.
కానీ లక్ష్మీనారాయణ మాత్రం ఈ విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించారు.మొదట్లో బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరిగినా చేరలేదు.
ఆ పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు అనే ప్రచారం జరిగింది.కానీ ఎవరూ ఊహించని విధంగా లక్ష్మీనారాయణ జనసేన పార్టీలో చేరిపోయారు.

ఆ పార్టీ తరఫున విశాఖలో ఎంపీగా పోటీ చేశారు.రాష్ట్రంలో అన్ని పార్టీల అభ్యర్థులకు భిన్నంగా విశాఖ ప్రజలకు తాను గెలిస్తే ఏం చేయబోతున్నాను అనే విషయాలను వంద రూపాయలు బాండ్ పేపర్ మీద రాసి హామీలను ప్రింట్ చేయించి పంపిణీ చేశారు.తాను గెలిస్తే నిత్యం ప్రజల కోసం పనిచేస్తానని భరోసా ఇచ్చారు.అయినా ఆయనకు విశాఖలో ఓటమి తప్పలేదు.రాష్ట్ర వ్యాప్తంగా విశాఖలో జనసేన ఎంపీ సీటు గెలుస్తుందని అంతా భావించారు.కానీ లక్ష్మీనారాయణ ఓడిపోవడం ఎవరూ జీర్ణించుకోలేకపోయారు.
ఇక అప్పటి నుంచి ఆయన పార్టీ పై అసంతృప్తి గా ఉంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
విశాఖలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నా ఎక్కడ పార్టీ పేరు చెప్పుకోవడం లేదు.
తాజాగా అమరావతి విషయంలో జనసేన యాక్టివ్ రోల్ పోషించినా లక్ష్మీనారాయణ మౌనంగా ఉండిపోయారు.అసలు జనసేన పార్టీ పై ఇప్పుడు ఇంత కోపం రావడానికి మరో కారణం కూడా కనిపిస్తోంది.
ఇటీవల బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకోవడం గురించి కనీసం తనను సంప్రదించలేదని ఆయన ఆగ్రహంగా ఉన్నారు.ఇటీవల ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో తన అసంతృప్తిని బయటపెట్టారు.
దీంతో ఆయన త్వరలోనే జనసేనకు దూరం అవ్వబోతున్నారనే విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది.