2019 ఆర్ధిక సంవత్సరానికి గాను భారతీయులకు సంబంధించి ఇప్పటి వరకు 23 శాతం హెచ్1 బీ వీసా దరఖాస్తులను అమెరికా ప్రభుత్వం తిరస్కరించిందని భారత విదేశాంగ శాఖ తెలిపింది.పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ రాజ్యసభకు ఈ మేరకు లిఖిత పూర్వకంగా తెలిపారు.
యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన వివరాల ప్రకారం 2019 ఆర్ధిక సంవత్సరానికి గాను హెచ్1బీ వీసా కోసం మొత్తం 1,16,031 దరఖాస్తులు అందాయి.వీటిలో 27,707 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి.
ఇదే సమయంలో హెచ్1బీ వీసాలను భారతీయ కంపెనీల వాటా చాలా తక్కువగా ఉన్నప్పటికీ.జారీ చేసిన మొత్తం వీసాల్లో దాదాపు 70 శాతం భారతీయులే పొందారని మురళీధరన్ తెలిపారు.
అలాగే డిసెంబర్ 2017 వరకు హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు హెచ్4 వీసా కింద జారీ చేసిన ఉపాధి ప్రామాణీకరణ పత్రాల్లో 93 శాతాన్ని భారతీయులే పొందారని ఆయన పేర్కొన్నారు.
2019 ఆర్ధిక సంవత్సరంలో (అక్టోబర్ 2018-సెప్టెంబర్ 2019) ప్రాసెస్ చేయబడిన హెచ్1బీ పిటిషన్లలో 84.8 శాతం ఆమోదించబడ్డాయి.ఇదే సమయంలో (అక్టోబర్ 2014- సెప్టెంబర్ 2015) ఆర్ధిక సంవత్సరంలో అత్యధికంగా 95.7 శాతం హెచ్1బీ దరఖాస్తులు ఆమోదించబడ్డాయని మురళీధరన్ తెలిపారు.