భారత సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్, ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాకు( Ajay Banga ) అరుదైన గౌరవం లభించింది.ఈ ఏడాదికి గాను ‘‘గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్’’ ( The Great Immigrants )జాబితాలో ఆయన స్థానం సంపాదించారు.
సామాజిక సేవ, విరాళాలు, ఇతర చర్యల ద్వారా అమెరికాను సుసంపన్నం చేసినందుకు అజయ్‌కు ఈ గౌరవం దక్కింది.ఈ మేరకు న్యూయార్క్‌లోని కార్నెగీ కార్పోరేషన్( Carnegie Corporation of New York ) ఓ ప్రకటనలో తెలిపింది.అంతేకాదు… గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ జాబితాలో స్థానం పొందిన తొలి భారతీయ వ్యక్తిగా అజయ్ బంగా రికార్డుల్లోకెక్కారు.ఈ ఏడాది జూన్‌లో ఆయన వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.
తద్వారా ఈ అత్యున్నత పదవిని పొందిన తొలి భారతీయుడిగా అజయ్ బంగా చరిత్ర సృష్టించారు.పేదరికాన్ని ఎదుర్కోవడానికి, వాతావరణ మార్పులను పరిష్కరించడానికి ప్రపంచబ్యాంకులో పరివర్తనాత్మక విధానాలను ప్రవేశపెట్టాలని ఆయన భావిస్తున్నారు.
అమెరికాలో ప్రతి ఏడాది జూలై 4న స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకుంటారు.ఆ రోజున కార్నెగీ కార్పోరేషన్ ఆఫ్ న్యూయార్క్ ‘‘ గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్’’ అవార్డులను ప్రదానం చేస్తుంది.దీనిలో భాగంగా ఈ ఏడాది 33 దేశాలు, వివిధ నేపథ్యాలకు చెందిన 35 మంది వ్యక్తులను సత్కరించనుంది.వీరిలో అధ్యాపకులు, వ్యవస్థాపకులు, ప్రజా సేవకులు, న్యాయవాదులు, కవులు వున్నారు.
స్కాటిష్ వలసదారు అయిన ఆండ్రూ కార్నెగీకి( Andrew Carnegie ) నివాళిగా ఈ ‘‘గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్’’ పురస్కారాలను ప్రకటిస్తున్నారు.ప్రస్తుతం కార్నెగీ కార్పోరేషన్ ఆఫ్ న్యూయార్క్‌ను ఐరిష్ వలసదారుడు డామే లూయిస్ రిచర్డ్‌సన్ ( Dame Louise Richardson )నడుపుతున్నారు.
కాగా.నవంబర్ 10, 1959న మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన అజయ్ బంగా పూర్తి పేరు.అజయ్ పాల్ సింగ్ బంగా( Ajay Pal Singh Banga ).ఆయన తండ్రి భారత సైన్యంలో ఉన్నత అధికారి.నిజానికి వీరి స్వగ్రామం పంజాబ్‌లోని జలంధర్.అయితే తండ్రి ఉద్యోగ రీత్యా వారి కుటుంబం తరచుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేది.అజయ్ బంగా తండ్రి హర్భజన్ సింగ్ బంగా.లెఫ్టినెంట్ జనరల్‌గా పదవీ విరమణ పొందారు.
అజయ్ బంగా విద్యాభ్యాసం సికింద్రాబాద్, జలంధర్, ఢిల్లీ, అహ్మదాబాద్, షిమ్లాలలో జరిగింది.బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రైమరీ విద్యను పూర్తి చేసిన ఆయన.ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్‌సన్ కాలేజ్ నుంచి ఎకనమిక్స్‌లో హానర్స్ పట్టా పొందారు.ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో పీజీపీ, అహ్మాదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎంబీఏ అందుకున్నారు.1981లో నెస్లేలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన అజయ్ బంగా.13 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు.ఆతర్వాత పెప్సీకోలో పనిచేశారు.