రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో బీజేపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది.విభజన హామీలు నెరవేర్చడంలో ఆ పార్టీ దారుణంగా విఫలమైంది.
దీంతో ఏపీలో పట్టు సాధించే దిశగా బీజేపీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతోంది.ఈ నేపథ్యంలో ఈనెల 4న ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనుండటంతో బీజేపీ నేతల్లో జోష్ నెలకొంది.
నిజానికి ఆయన పొరుగున ఉన్న తెలంగాణకు రెండు, మూడు సార్లు వచ్చినా.ఏపీ వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు.
దీంతో ఏపీ ప్రజల సమస్యలపై స్పందించేందుకు ఆయన ఇష్టపడడం లేదనే ప్రచారం జరిగింది.
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
అదేవిధంగా అల్లూరి కాంస్య విగ్రహాన్నిఆవిష్కరిస్తారు.ఈ సందర్భంగా నిర్వహించే సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సభపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.ఈ సభ వేదికగా ఏపీకి ప్రధాని మోదీ ఎలాంటి హామీలు ఇస్తారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ పుంజుకోవడానికి ఆయన ఎలాంటి చర్యలు చేపడతారన్న అంశాలపై చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్టేట్‌మెంట్ కోసం మోదీ ఏం చెప్తారంటూ ఏపీలో రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
పీఎం హోదాలో ఏపీకి వస్తున్న మోదీ అలాగే వ్యవహరిస్తారా.బీజేపీకి ఏదైనా ముఖ్య సూచనలు చేస్తారా అన్న విషయం కూడా ఆసక్తి రేపుతోంది.

ఏపీలో ప్రస్తుతం బీజేపీ జనసేనతో పొత్తులో ఉండటం వల్ల వచ్చే ఎన్నికలకు సంబంధించి పొత్తులపై వ్యాఖ్యలు చేస్తారో లేదో వేచి చూడాలి.
అటు ప్రధాని మోదీ పర్యటనతో క్యాడర్‌లో కచ్చితంగా జోష్ పెరుగుతుందని బీజేపీ భావిస్తోంది.ప్రజల్లో, పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేలా.రాష్ట్రంలో ఏం మాట్లాడాలి, ఏయే అంశాలు ప్రస్తావించాలో ప్రధాని దృష్టికి పార్టీ నాయకులు తీసుకెళ్లినట్లు సమాచారం.క్యాడర్‌లో కాస్త ఉత్సాహం నింపేలా ప్రధాని ప్రసంగాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.అయితే ఏపీలో కొన్నేళ్లుగా మారని బీజేపీ పరిస్థితి ఇప్పుడు ప్రధాని పర్యటనతో మారుతుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.