ఏపీలో అధికార టీడీపీలో వేగలేకపోతోన్న ఓ అసంతృప్త ఎమ్మెల్యే పార్టీ వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా ? వచ్చే ఎన్నికలకు కాస్త ముందుగానే సదరు ఎమ్మెల్యే సైకిల్ దిగి, ఫ్యాన్ నీడ చేరేందుకు పక్కాగా స్కెచ్ సిద్ధమవుతోందా ? అంటే గుంటూరు జిల్లాలో తాజా పరిణామాలు అవుననే ఆన్సర్ ఇస్తున్నాయి.గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి గత కొద్ది రోజులుగా పార్టీలో ఇమడ లేకపోతున్నారు.
2009లో నరసారావుపేట నుంచి ఎంపీగా గెలిచిన ఆయన్ను చంద్రబాబు గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్‌కు మార్చారు.రాయపాటి కోసం మోదుగుల ఎంపీ సీటును వదులుకుని ఎమ్మెల్యేగా వచ్చారు.
ఆ తర్వాత తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ధీమాగా ఉన్నా బాబు మాత్రం ఆయనకు షాక్ ఇచ్చారు.మోదుగులకు మంత్రి పదవి రాలేదు.
ఇక తన నియోజకవర్గంలోనే మోదుగుల మాట చెల్లుబాటు కావడం లేదు.మిర్చి మార్డు ఆయన నియోజకవర్గంలో ఉంటే ఆయన చెప్పిన వాళ్లకు చైర్మన్ పదవి రాలేదు.
స్టేడియం పాలకవర్గం విషయంలో సైతం మంత్రి ప్రత్తిపాటి మాటే నెగ్గింది.నియోజకవర్గంలో ఇప్పటకీ ఆయన పట్టు సాధించలేకపోతున్నారు.
ఈ క్రమంలోనే తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో తిరిగి నరసారావుపేట ఎంపీగా వెళ్లిపోతానని కూడా ప్రకటించారు.
అయితే అది కూడా సాధ్యమయ్యేలా లేదు.
అక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మోదుగల బావ అయోధ్య రామిరెడ్డే ఉన్నారు.దీంతో మోదుగుల తీవ్ర అసంతృప్తితో వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాజాగా ఆయన జిల్లాకే చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.జిల్లాలో నకిలీ విత్తనాలు తయారు చేసేవాళ్లను కొందరు కాపాడుతున్నారని ఆయన మంత్రి పుల్లారావుపై పరోక్షంగా విమర్శలు చేశారు.
పార్టీలో వరుసగా జరుగుతోన్న అవమానాలు భరించి ఇక పార్టీలో కొనసాగడానికి తాను సిద్ధంగా లేనని సన్నిహితుల వద్ద మోదుగుల వాపోతున్నారట.ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలకు ముందుగా మోదుగుల బావ అయోధ్య రామిరెడ్డి రూట్లో నడుస్తారని, ఆయన వైసీపీలోకి వెళ్లిపోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.