బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన కేసులో మరో టీడీపీ ఎమ్మెల్యే చిక్కుకున్నారు.విశాఖపట్నం నార్త్ నియోజవర్గ ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావు తాను భాగస్వామిగా ఉన్న ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కోసం ఇండియన్ బ్యాంక్‌లో లోన్ తీసుకున్నారు.
గంటాతోపాటు మరో ఎనిమిది మంది ఇందులో భాగస్వాములుగా ఉన్నారు.
ఈ రుణం కోసం కొన్ని స్థిరాస్థి పత్రాలను వాళ్లు తనఖా పెట్టారు.2016, సెప్టెంబర్‌లోనే ఈ లోన్ తీర్చాల్సిందిగా ప్రత్యూష కంపెనీకి నోటీసులు జారీ అయ్యాయి.అయితే మూడేళ్లుగా ఆ రుణం చెల్లించలేకపోయింది.దీంతో సంస్థ హామీగా పెట్టిన ఆస్తులను వేలం వేయాలని ఇండియన్ బ్యాంక్ నిర్ణయించింది.2016, సెప్టెంబర్ నాటికి లోన్, వడ్డీ కలిపి రూ.141.68 కోట్లుగా ఉంది.
అయితే ఈ మూడేళ్లలో అది కాస్తా రూ.208 కోట్లకు చేరింది.బ్యాంకులో తనఖా పెట్టిన మొత్తం 26 ఆస్తుల్లో గంటా శ్రీనివాసరావుకు చెందినవి కూడా ఉన్నాయి.విశాఖపట్నంలో ఓల్డ్ టౌన్ ఏరియాలో ఉన్న సంస్థ ఆఫీస్ కాంప్లెక్స్‌తోపాటు గాజువాక, రుషికొండ, మధురవాడ, ఆనందపురం, అనకాపల్లి, కాకినాడ, తమిళనాడుల్లోని ఆస్తులను కూడా వేలానికి పెట్టినట్లు ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది.
డిసెంబర్ 20న ఈ ఆస్తులను ఈ-వేలం వేయనున్నారు.గతంలో టీడీపీ ఎంపీగా ఉండి.ప్రస్తుతం బీజేపీలోకి వెళ్లిన సుజనా చౌదరి కూడా ఇలాంటి కేసులోనే చిక్కుకున్న విషయం తెలిసిందే.వైస్రాయ్ హోటల్స్ ఆస్తులకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులను మోసం చేసినట్లు సుజనాపై ఆరోపణలు ఉన్నాయి.