ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఎన్నికలను నిర్వహించే సమున్నత స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ రాజీపడరాదన్న సుప్రీంకోర్టు స్పూర్తికి పట్టం కట్టాలి.అధికార దుర్వినియోగంతో అధికార ఫీఠాలను పదిలం చేసుకొంటున్న వారి వికృత పోకడలకు అడ్డుకట్ట వెయ్యాలి అంటే ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషించే ఎన్నికల సంఘం సర్వ స్వతంత్రంగా ఉండాలి.
ఎన్నికల కమీషనర్ల నియామకంలో కొలీజియం లాంటి వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలని కోరుతూ దాఖలైన పిల్ విచారణ సందర్బంగా సుప్రీం కోర్టు ధర్మాసం సంచలన వ్యాఖ్యలు చేసింది.ఎన్నికల కమీషన్ పూర్తీ స్వతంత్రంగా పనిచేయాలి అంటే స్వతంత్రత ,నిజాయితీ,నిబద్దత గల వ్యక్తిని ఛీఫ్ ఎన్నికల కమిషన్ గా నియమించాలని తేల్చి చెప్పింది.
ఎన్నికల కమీషన్ ఎన్నికల ప్రభావానికి లోనుకాకుండా వుండాలని,ప్రధాని స్థాయి వ్యక్తి పై ఆరోపణలు వచ్చినా కమీషన్ చర్యలు తీసుకొనేలా వుండాలని సూచించింది.కేంద్ర ఎన్నికల కమిషనర్ గా మాజీ ఐఏ ఎస్ అధికారి అరుణ్ గోయల్ నియామకంలో అంత తొందర ఏమిటని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
అరుణ్ గోయల్ స్వచ్ఛంద పదవి విరమణ చేసిన రెండు రోజుల్లోనే ఆయన నియామకాన్ని నోటిఫై చెయ్యడం, ఇదేం నియామకం అని ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం.ఈ నియామక పక్రియ పై ఆందోళన చెందుతున్నాం.
గోయల్ ఫైలును ఎందుకంత హడావుడిగా ఆమోదించాల్సి వచ్చింది.గోయల్ ను మాత్రమే ఎలా నియమించారు?గోయల్ పేరును ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? మిగిలిన వారిని ఏ ప్రాతిపదికన తిరస్కరించారు.గోయల్ నియామకానికి అనుసరించిన పద్దతి ఏమిటని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని నిగ్గదీసింది .నిష్పక్ష పాతంగా,సర్వ స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అత్యంత కీలక పీఠం పై కీలు గుర్రాలను నియమిస్తే మనం నిర్మించుకున్న ప్రజాస్వామ్య మనుగడ ఏమికావాలి.స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలను సక్రమంగా నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం ప్రతిష్ట తిరిగి నిలబడాలి అంటే సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేసిన విధంగా న్యాయబద్దంగా,పారదర్శక పద్దతిలో ఎన్నికల కమీషన్ల నియామకం జరగాలి.

దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం చూపుతున్నచొరవ అరణ్య రోదనగా మిగిలిపోరాదు.నేడు స్వయం ప్రతిపత్తి గల సుదృఢ ఎన్నికల వ్యవస్థ అత్యవసరం.ఎన్నికల సంఘాల నియామకం, ప్రవర్తన పై ఎప్పటి నుంచో దేశ వ్యాప్త చర్చజరుగుతుంది.
ఎన్నికల కమీషన్ల నియామకమే లోప భూయిష్టంగా మారింది.ఈసీల నియామకం వివాదం కాకుండా ప్రత్యేక యంత్రాంగం వుండాలన్న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయం నెరవేరక దొడ్డి దారి నియామకాలు జరుగుతున్నాయి.
రాజకీయ, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించే స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలిగే వ్యక్తులు ఎన్నికల కమీషనర్ కావాలి .ప్రధాని,లోక్ సభలో ప్రతిపక్ష నేత,భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యులు ద్వారా ఎన్నికల కమీషనర్లను ఎంపిక చెయ్యాలని ఎన్నో ఎళ్ల క్రితమే లా కమీషన్ సిఫార్సు చేసింది.ఈసీల నియామక విధానాన్ని పక్షపాత రహితంగా మార్చాలని ఈసీ పదవుల భర్తీలలో విపక్షాలకు భాగ స్వామ్యం కల్పించాలని 2012 లో బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీ అప్పటి ప్రభుత్వాన్ని కోరారు.

మూడింటా రెండొంతుల మెజారిటీ తో పార్లమెంట్ ఆమోదించిన వ్యక్తులనే కమిషనర్లుగా నియమించాలని సభ సభ్యులు ఆచార్య సక్సేనా సూచించారు.ఎన్నికల కమీషన్ల నియామకాల్లో అధికారం పక్షం ఇష్టా రాజ్యానికి అడ్డుకట్ట వెయ్యాలన్నది ఎంత సహేతుకమో అధికార పక్షం పదే,పదే ఆ ప్రక్రియను దుర్వినియోగం చేస్థున్న తీరును దృవీకరిస్తుంది.రాజ్యాoగ బద్ద మైన నిష్పక్షపాత ఎన్నికల వ్యవస్థ నేడు విశ్వసనీయత కోల్పోయింది.
ఎన్నికల నిర్వహణ పట్ల కొడిగట్టి పోతున్న ప్రజల నమ్మకాన్ని మళ్ళీ నిలబెట్టాలి అంటే ఆ వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళించాల్సిందే.ఈ సీ లో వ్యవస్థీ కృత మార్పులు అనివార్యమని సామాజిక వేత్తలు,మేధావులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రపతి ఆద్వర్యంలో కొలిజియంతో ఎన్నికల కమీషనర్ల ఎంపిక జరగాలన్న డిమాండ్ కూడా ఎప్పటి నుంచో వున్నది.ఇలాంటి మౌలిక విషయాన్ని పట్టించుకోవాల్సి వుంది.నీతివంత మైన పాలనకు బాటలు వెయ్యాల్సిన ఎన్నికల వ్యవస్తే మన దేశంలో బ్రష్టు పట్టి పోవడం అత్యంత బాధాకరం.దశాబ్దాలుగా ఎన్నికల సంస్కరణలు ఎండమావిని తలపిస్తున్నాయి.
సమగ్ర ఎన్నికల సంస్కరణల కోసం ఈసీ,లా కమీషన్ సహ పలు నిపుణుల సంఘాలు మొరపెట్టుకొంటున్నాకొన్నేళ్లుగా ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి.