శనివారం మధ్యాహ్నం 1:10 గంటల సమయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.60 అడుగుల ఎత్తు ఫ్లై ఓవర్ నుంచి నేరుగా కింద పడ్డ కారు ఒకరి ప్రాణాలను బలి కొనగా, పలువురు గాయపడినట్లు తెలుస్తుంది.ఈ ఘోర ప్రమాదం హైదరాబాద్ లో చోటుచేసుకుంది.గచ్చిబౌలి లోని బయో డైవర్సిటీ పార్క్ వద్ద మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ పై నుంచి ఒక వోక్స్ వ్యాగన్ కారు దాదాపు 120 కిలోమీటర్ల వేగం తో దూసుకొచ్చి అదుపు తప్పడం తో ఏకంగా 60 అడుగుల ఎత్తు ఉన్న ఆ ఫ్లై ఓవర్ నుంచి నేరుగా కింద రోడ్డు మీద పడడం తో రోడ్డుపై నుంచొని ఉన్న మనుషులపై పడింది.
దీనితో అక్కడే ఆటో కోసం నిలబడి ఉన్న ఒక మహిళ (40) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఆమె కుమార్తె,అలానే ఒక ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది.రోడ్డు పై పడిన కారు ఆ తరువాత పల్టీ కొట్టుకుంటూ పక్కనే ఉన్న పెద్ద చెట్టును డీ కొట్టడం తో అమాంతం ఆ చెట్టు కూడా నేలకూలిపోయింది.
ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామాలతో అక్కడ సమీపంలో ఉన్న జనం హాహాకారాలు చేస్తూ ప్రాణాల కోసం పరుగులు తీశారు.కొద్దిసేపటికి చూస్తే.కారు కింద ఓ అభాగ్యురాలు.మెడ భాగం సగం దాకా తెగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
ఈ బీభత్సాన్ని కళ్లారా చూసిన జనం గజగజ వణికిపోయారు.కొన్ని గంటల పాటు తేరుకోలేకపోయారు.
మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని సీసీ టీవీల ద్వారా నిర్ధారించారు.ఫ్లై ఓవర్‌పై నిబంధనల ప్రకారం గంటకు గరిష్ఠంగా 40కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన ఆ కారు మితిమీరిన వేగం తో వెళ్లడం తో అదుపుతప్పి ఇలా ఫ్లై ఓవర్ నుంచి నేరుగా కిందకు పడింది.
దీనితో ఈ ఘటనలో మృతి చెందిన మహిళ మణికొండకు చెందిన కృష్ణ వేణి(40) గా అధికారులు గుర్తించారు.పక్కనే ఉన్న ఆమె కూతురు ప్రణీత మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా తప్పించుకున్నట్లు తెలుస్తుంది.

అయితే ఇదే ఘటనలో ముదావత్ బాలాజీ అనే ఆటో డ్రైవర్‌కు కాలు విరగ్గా చెట్టు సమీపంలో ఉన్న మరో ఇద్దరు గాయపడినట్లు తెలుస్తుంది.కారు నడుపుతున్న వ్యక్తి జూబ్లీహిల్స్‌కు చెందిన కల్వకుంట్ల శ్రీధర్ రావు కుమారుడు, కృష్ణ మిలన్ (27)గా అధికారులు గుర్తించారు.అతడి తల, భుజానికి తీవ్ర గాయాలయ్యాయి.అంతెత్తు నుంచి కారు పడ్డా లోపల ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో అతడి ప్రాణాలు దక్కినట్లు తెలుస్తుంది.దీనితో అక్కడే ఉన్న స్థానికులు అతడిని బయటకు లాగి అతడితో పాటు మిగతా క్షతగాత్రులను కూడా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.