తిట్టుకోవడం, గ్రూపు రాజకీయాలు చేయడం, అలకలు ఆవేశాలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో తరుచుగా చోటుచేసుకునే సంగతులు.కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత అంతర్గత ప్రజాస్వామ్యం మరి ఏ ఇతర పార్టీలలోనూ కనిపించదు.
ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా ఎవరైనా కాంగ్రెస్ గ్రూపు రాజకీయాల నుంచే ఒక్కో మెట్టు ఎక్కుతూ రాజకీయ ఉన్నత శిఖరాలు చేరుకుంటూ ఉంటారు.అందుకే ఎప్పుడు ఆ పార్టీలో యుద్ధ వాతావరణం కనిపిస్తూనే ఉంటుంది.
ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇదే తంతు ప్రతిరోజు చోటుచేసుకుంటూ వచ్చింది.మొన్నటి వరకు ఈ విధంగానే తిట్టుకున్న టీ కాంగ్రెస్ నాయకులంతా ఇప్పుడు ఒక్కటిగా కలిసిపోయి అందరికీ షాక్ ఇస్తున్నారు.

అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులంతా ఎవరికి వారు తామే సీనియర్ నాయకులు అన్నట్టుగా ఇతరులపై విమర్శలు చేస్తూ ఉంటారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, బట్టి విక్రమార్క, వి.హనుమంతరావు, రేవంత్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పెద్దగానే ఉంటుంది.ప్రస్తుతం హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరుగుతూ ఉండడం అక్కడ అధికార టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా వెనకబడి పోవడంతో కాంగ్రెస్ నాయకుల్లో ధీమా అమాంతం పెరిగిపోయింది.
అందుకే వీరంతా ఒక్కటిగా ఏకమయి ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు.దీనంతటికీ కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి ,ఉందుచూపే కారణమనే చర్చ జరుగుతోంది.ఆమె తీసుకున్న చొరవ కారణంగానే కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా ఇలా ఏక రాగం వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి తో వైరం ఉన్న నాయకులందరిని పిలిచి ఎన్నికల వరకైనా నా సఖ్యతగా ఉండాల్సిందిగా ఆమె కోరినట్టు సమాచారం.దీంతో మెత్తబడిన సీనియర్లంతా హుజూర్ నగర్ లో గెలిచి తమ బలం చూపించాలనే నిర్ణయానికి వచ్చారట.ఈ విధంగానైనా ఏకమైన ఈ కాంగ్రెస్ నాయకులంతా ముందు ముందు కూడా ఈ విధంగానే వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్వైభవం రావడం ఖాయం అనే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం తెలంగాణాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై అధిష్టానం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్టు పార్టీలో చర్చ నడుస్తోంది.