ప్రస్తుతం ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలు విజయవంతమైతే త్వరలోనే ప్రజలతోపాటు ప్రభుత్వంపైనా పెట్రో భారం భారీగా తగ్గనుంది.త్వరలోనే మిథనాల్ కలిపిన ఇంధనాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది.
అదే జరిగితే ఓ వ్యక్తి ఇంధనం చేస్తున్న ఖర్చు 10 శాతం మేర తగ్గనుంది.
అంతేకాదు దీనివల్ల కాలుష్యం కూడా 30 శాతం మేర తగ్గుతుందని నిపుణలు అంచనా వేస్తున్నారు.ఇక పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతి తగ్గి ఏడాదికి ప్రభుత్వ ఖజానాకు రూ.5 వేల కోట్లు మిగలనున్నాయి.సాధ్యమైనంత త్వరగా మిథనాల్ అందుబాటులోకి తేవాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ.పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు.
ప్రస్తుతం దేశంలో ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని వాడుతున్నారు.అయితే ఒక లీటర్ ఇథనాల్‌ను తయారు చేయడానికి రూ.42 ఖర్చవుతోంది.అదే మిథనాల్ అయితే రూ.20 లోపే అవుతుంది.దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతాయి.
ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎం15 (15 శాతం మిథనాల్, 85 శాతం పెట్రోల్) ఇంధనాన్ని వాణిజ్య వినియోగంలోకి తీసుకొచ్చింది.
ఎం 15తోపాటు ఎం85, ఎం100 మిథనాల్ మిశ్రమ ఇంధన తయారీకి ప్రభుత్వం ప్రమాణాలను రూపొందించింది.ప్రస్తుతం అస్సాం పెట్రోకెమికల్స్ రోజుకు వంద టన్నుల మిథనాల్‌ను తయారు చేస్తోంది.2020, ఏప్రిల్ నాటికి దీనిని 600 టన్నులకు పెంచనుంది.అటు పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌లలో బొగ్గు ద్వారా మిథనాల్‌ను తయారుచేసే ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.