సినిమా రంగంలోని చాలామందికి ఉన్నత చదువులు చదవాలని ఉన్నా వరుస అవకాశాలతో బిజీగా ఉండడం వల్లో, ఇతర కారణాల వల్లో చదువుకు దూరమవుతూ ఉంటారు.అయితే వాళ్లలో చదవాలన్న కోరిక మాత్రం అలాగే ఉంటుంది.
చదవాలన్న కోరిక ఉంటే ఏ వయస్సులోనైనా పరీక్షలు రాసే అవకాశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి.ఆ అవకాశాన్ని కొంతమంది సద్వినియోగం చేసుకుని ఉన్నత చదువుల కోసం పరీక్షలు రాస్తున్నారు.ప్రముఖ సినీ నటి హేమ నల్గొండ జిల్లాలోని ఎన్జీ కళాశాలలో నేడు డిగ్రీ అర్హత పరీక్ష రాశారు.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీలో చేరేందుకు రాసే పరీక్షకు హాజరై విద్యార్హత పెంచుకోవడానికి వయస్సుతో సంబంధం లేదని ప్రూవ్ చేశారు.
ఉన్నత చదువులు చదవాలనే కోరిక బలంగా ఉంటే వయస్సు అడ్డు కాదని నిరూపించారు.హైదరాబాద్ లో ఇబ్బందులు ఎదురవుతాయని భావించి నల్గొండలో పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
చాలా సంవత్సరాల నుంచి డిగ్రీ పూర్తి చేయాలని అనుకుంటున్నానని ఆమె చెప్పారు.ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నానని పేర్కొన్నారు.
నల్గొండ ప్రాంతంలో తనకు బంధువులు ఉన్నారని.నల్గొండ ఫిలిం సిటీకి దగ్గరగా ఉండటంతో ఇక్కడే పరీక్ష కేంద్రాన్ని ఎంచుకుంటున్నానని చెప్పారు.
హైదరాబాద్ లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని, ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉంటాయని అన్నారు.
నటి హేమ పరీక్ష రాయడానికి వచ్చారని తెలిసి పరీక్ష తరువాత ఆమెను కలిసేందుకు అభిమానులు వచ్చారు.
సోషల్ మీడియాలో హేమ పరీక్ష రాసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది.ఉన్నత చదువులు చదవడానికి హేమ కష్టపడుతూ ఉండటాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.53 ఏళ్ల వయస్సులో హేమ డిగ్రీ కోసం శ్రమిస్తున్న తీరు ప్రశంసనీయమని ఆమెను మెచ్చుకుంటున్నారు.