మనం మెడికల్ షాపులలో మందులు ఎందుకు కొంటాం.మనకున్న వ్యాధి తగ్గడానికే కదా.
కానీ ఆ మందులే ప్రమాణాలకు తగినట్లుగా లేకపోతే మన పరిస్థితి ఏంటి? రోగం తగ్గకపోగా సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడతాం.కానీ తెలంగాణలో ఇప్పుడు జరుగుతోంది అదే.పెద్ద ఎత్తున శాంపిళ్లు ల్యాబ్ టెస్ట్‌లలో ఫెయిల్ అవుతుండటం, డ్రగ్ అధికారులు కంపెనీలతో కుమ్మక్కవడం ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తోంది.

ఈ సమస్యకు ప్రధాన కారణం రాష్ట్రంలో తగిన సంఖ్యలో డ్రగ్ ఇన్స్‌పెక్టర్లు లేకపోవడమే అని తేలింది.వేల సంఖ్యలో మందుల దుకాణాలు ఉన్నా.వాటిలో ప్రమాణాలకు తగినట్లుగా మందులు ఉంటున్నాయా లేదా అన్నది తేల్చాల్సింది డ్రగ్ ఇన్స్‌పెక్టర్లే.
కానీ వీళ్ల సంఖ్య మాత్రం కేవలం 61 మాత్రమే.వీళ్లలోనూ సగం మంది కేవలం హైదరాబాద్‌కే పరిమితమయ్యారు.
దీంతో మెడికల్ షాపులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.ప్రిస్క్రిప్షన్లు లేకుండానే మందులు ఇవ్వడంతోపాటు నాసిరకం మందులు కూడా అంటగడుతున్నారు.వీటి వల్ల ఉన్న రోగం అనుకున్న సమయానికి తగ్గడం లేదు.పైగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటున్నాయి.
శాంపిళ్ల టెస్ట్‌లో కనీసం నాలుగు శాతం వరకూ ఫెయిలవుతున్నాయి.

సాధారణంగా మందులకు 9 రకాల పరీక్షలు జరుపుతారు.వీటిలో ఏ ఒక్కదాంట్లో ఫెయిలైనా ఆ మందు ప్రమాణాలకు తగినట్లు లేదనే నిర్ధారిస్తారు.ముఖ్యంగా ఏదైనా టాబ్లెట్ లేదా సిరప్ లేదా ఇంజెక్షన్‌లో ఉండాల్సిన స్థాయిలో మందు ఉండటం లేదు.
పైగా లోనికి వెళ్లిన తర్వాత సమయానికి మందు విడుదల కావడం లేదని కూడా టెస్టుల్లో తేలుతోంది.
డ్రగ్ ఇన్స్‌పెక్టర్ల కొరతతోపాటు ఉన్న వాళ్లు కూడా కంపెనీలతో కుమ్మక్కవుతుండటంతో ఈ నాసిరకం మందులు యథేచ్ఛగా మార్కెట్‌లోకి వచ్చేస్తున్నాయి.
సాధారణంగా ఏదైనా మందు నాసిరకంగా అని టెస్టుల్లో తేలితే వాటిని మొత్తం వెనక్కి పిలిచి ధ్వంసం చేయాల్సి ఉంటుంది.అయితే ఇది కంపెనీలకు భారీ నష్టాన్ని చేకూరుస్తాయి.
అలా కాకుండా అధికారులకు ఎంతో కొంత చెల్లించి ఆ మందులను అలాగే మార్కెట్‌లో విక్రయించేలా చూసుకుంటున్నారు.
మందుల నాణ్యతపై ఈ మధ్యే లోక్‌సభలోనూ కేంద్రం స్పందించింది.
నాణ్యత లేని మందులు ప్రతి ఏటా పెరుగుతున్నట్లు కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో స్పష్టమవుతోంది.