రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ కన్నులు విందుగా జరుగుతూ ఉంది.ఈ క్రమంలో ఇప్పటికే చాలామంది ప్రముఖులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.“సృష్టి.స్థితి.లయ కారకుడయిన సూర్య భగవానుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ పుణ్య సమయాన నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన సర్వజనులకు ముఖ్యంగా నాకు ప్రీతిపాత్రమైన తెలుగు వారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతి ఫలసాయాల మేలు కలయికే మన సంక్రాంతి.నెలగంట ప్రారంభమయ్యే ఈ సంక్రాంతి సంబరాలు.
రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసుల ఆశీర్వచనాలు, గంగిరెద్దుల విన్యాసాలు, నింగిని తాకాలనుకునే పతంగులు, కోడి పందాలు, పశుజాతి ప్రదర్శనలు, నూతన వస్త్రాలు, నోరూరించే పిండివంటలతో మూడు రోజులపాటు ఆబాల గోపాలాన్ని అలరిస్తాయి.తెలుగు జాతికి గర్వకారణమైన ఈ సంక్రాంతి ఆచంద్రార్కం వర్ధిల్లాలని, మన సంస్కృతికి పట్టుగొమ్మగా విలసిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.
పండుగ శోభతో తెలుగు లోగిళ్ళు సిరిసంపదలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”…అనీ పవన్ కళ్యాణ్ తెలిపారు.