రాజకీయ పార్టీల కోసం ప్రశాంత్ కిషోర్, ఐపాక్ టీమ్ వేరు వేరుగా పనిచేయనున్నాయి.వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారానికి ఐ-ప్యాక్‌తో టీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకున్నది.
రెండు రోజుల వ్యవధిలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరడం లేదనే క్లారిటీ రావడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది.పార్టీ ఆవిర్భావ దినోత్సవాలకు ఒక రోజు ముందే టీఆర్ఎస్‌లో ఉత్సాహం నెలకొన్నది.
కాంగ్రెస్ పార్టీలో కల్లోలం సృష్టించే కేసీఆర్ ప్లాన్ సక్సెస్ అయిందని, మాస్టర్ స్ట్రోక్ వర్కవుట్ అయిందని టీఆర్ఎస్ శ్రేణులు సంతోషంలో మునిగిపోయాయి.ఒకవైపు ఐ-ప్యాక్‌తో డీల్, మరోవైపు కాంగ్రెస్-పీకేల మధ్య రిలేషన్‌ను దెబ్బతీయడం సగం సక్సెస్ సాధించినట్లేనని సంబురపడుతున్నారు.
మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సృష్టిస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.అనేక పార్టీలకు గతంలో వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్‌ను ఇప్పుడు వాడుకోవడం ద్వారా గెలుపు ఖాయమనే మెసేజ్‌ను ప్రజల్లోకి పంపగలిగామని టీఆర్ఎస్ నాయకులు జిల్లాల్లో గొప్పగా చెప్పుకుంటున్నారు.
కేంద్రంలో 2014లో బీజేపీని పవర్‌లోకి తెచ్చిందీ, ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్, నితీష్ కుమార్, వైస్ జగన్, స్టాలిన్, మమతాబెనర్జీ తదితరులను అధికారంలోకి తెచ్చిందీ పీకే అని కిందిస్థాయి పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు గొప్పగానే చెప్పుకుంటున్నారు.పీకేకు చెందిన ఐ-ప్యాక్‌తో ఒప్పందం జరిగినందున ఇక గెలుపు ఖాయమనే సంతోషాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల్లోకి కూడా దీన్నే వ్యాప్తి చేసి వారి మైండ్‌ను సెట్ చేస్తున్నారు.కాంగ్రెస్‌తో పీకే బంధాన్ని తెంచడం ద్వారా టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా దెబ్బకొట్టిందనే అభిప్రాయం టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతున్నది.కాంగ్రెస్‌లో చేరడం ఖాయమనే సంతోషంలో ఉన్న ఆ పార్టీ నేతలను పీకే తాజా ట్వీట్ షాక్‌కు గురిచేసింది.ఐ-ప్యాక్‌తో టీఆర్ఎస్ డీల్ కుదుర్చుకున్నదంటూ కేటీఆర్ కామెంట్ చేసిన గంటల వ్యవధిలో రేవంత్ స్పందించి ఆ పార్టీతో బంధాన్ని తెంచుకోడానికే హైదరాబాద్ వచ్చి భేటీ అయ్యారని వ్యాఖ్యానించారు.
కానీ దానికి విరుద్ధంగా పీకే తీసుకున్న డెసిషన్ కాంగ్రెస్‌ను నైతికంగా డిఫెన్సులో పడేసింది.టీఆర్ఎస్ నేతలు చెప్పిన మాటలే పీకే ట్వీట్ ద్వారా నిజమని తేలడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశ నెలకొన్నది.

రాహుల్‌గాంధీ వారం పదిరోజుల్లో రాష్ట్ర టూర్‌కు రావడానికి ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.ఒకవైపు కాంగ్రెస్‌ను డీమోరల్ చేస్తూనే మరోవైపు ప్లీనరీకి ఒక రోజు ముందే సగం సక్సెస్ సాధించామని టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకోవడం మళ్లీ గులాబీ పార్టీ విజయం ఖాయమనే మెసేజ్‌ను ప్రజల్లోకి పంపినట్లయింది.కేసీఆర్‌ను మించిన వ్యూహకర్త ఎవరున్నారు అని టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నా మళ్ళీ ఆయన అవసరం ఆ పార్టీకి తప్పలేదు.దాదాపు ఎనిమిదేళ్ళ కాలంలో అనేక పెద్ద రాష్ట్రాలకంటే ఎక్కువ అభివృద్ధి, సంక్షేమం సాధించిన ఘనత తెలంగాణది అని చెప్పుకుంటూనే హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓటమితో ఒకింత టెన్షన్‌లో పడింది టీఆర్ఎస్.
ప్రజల దీవెనలతో రెండోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చామనే ధీమా ఇప్పుడు టీఆర్ఎస్ నేతల్లో తగ్గిపోయింది.బీజేపీకి దీటుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారంను ఉధృతంగా వాడుకోవాలని పార్టీ కార్యకర్తలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో సమీక్షా సమావేశాల్లో పిలుపునిచ్చారు.
ఐటీ సెల్‌ను పటిష్టం చేశారు.ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల వినియోగాన్ని పెంచడంతో పాటు వాటి ద్వారా ప్రజలకు కనెక్ట్ కావడానికి ఐ-ప్యాక్ సేవలను వాడుకోనున్నది.