ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది.అంతేకాకుండా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఓటింగ్ ద్వారా ఈ బిల్లును నెగ్గించుకున్నారు.
అయితే మూడు రాజధానులు,సీఆర్డీఏ బిల్లు రద్దు తర్వాత మండలిని జగన్ చేయబోతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున వచ్చినా అవన్నీ కల్పిత ప్రచారాల గానే టీడీపీతో పాటు అంతా భావించారు.కానీ జగన్ మాత్రం దూకుడుగా ఈ నిర్ణయం తీసుకొని సక్సెస్ అయ్యారు.
అయితే దీనిపై టిడిపి ఆందోళన చెందినా పైకి మాత్రం మండలి రద్దు కు కేంద్రం ఆమోదం కావాలి కదా, కేంద్రం అడ్డుకుంటుంది కాబట్టి మండలి రద్దు అవ్వదు అనే ఆశలో ఉంది.

కేంద్ర పెద్దలు జగన్ కు అన్ని విధాల సహకరిస్తున్నారని, అసలు మండలిని రద్దు చేయాలనే విషయాన్ని బిజెపి అగ్రనేత అమిత్ షా జగన్ కు సూచించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.కేంద్ర పెద్దల అనుమతి లేకుండా జగన్ ఇంతటి సాహసానికి ఒడిగట్టరని, అలా అవకాశమే లేదని రాజకీయ పండితులు కూడా అంచనా వేస్తున్నారు.ఇక ఈ విషయంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా ఇదే విధంగా తన స్పందనను తెలియజేశారు.
అమిత్ షా తో నే కాదు, కేంద్ర బిజెపి పెద్దల అనుమతి తోనే జగన్ ఈ విధంగా రాజకీయం చేస్తున్నారని, కౌన్సిల్ రద్దు వెనుక ఎన్నో స్వార్థ రాజకీయాలు ఉన్నాయంటూ నారాయణ తేల్చిచెప్పారు.

నారాయణ సంగతి పక్కన పెడితే, కేంద్రం మండలిని రద్దు చేయాలని చూస్తోందని, కానీ తమ చేతికి మట్టి అంటకుండా ఇలా ఆయా రాష్ట్రాల అధికార పార్టీలతో మండలిని రద్దు చేసే విధంగా రాజకీయం చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా ఏపీలో బలం పెంచుకోవడానికి, బిజెపి బలపడాలంటే ముందుగా తెలుగుదేశం పార్టీని బలహీన పరచాలని చూస్తోంది.దానిలో భాగంగానే చంద్రబాబుకు ఆయన రాజకీయ వారసుడు లోకేష్ కు భవిష్యత్తు లేకుండా చేసేందుకు కేంద్ర బిజెపి పెద్దలు జగన్ కు ఈ విధంగా సలహా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.