సంచలన నిర్ణయాలదిశగా అడుగులు వేస్తూ సంస్కరణల బాట పడుతున్న జగన్ ప్రభుత్వం ఏపీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.ముఖ్యంగా ప్రజా సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీపడే ఉద్దేశంలో సీఎం జగన్ ఉన్నట్టుగా కనిపించడంలేదు.
అలాగే తమ ప్రభుత్వం మీద కూడా ఎటువంటి అవినీతి మరకలు లేకుండా లేకుండా కూడా చూసుకోవాలని జగన్ భావిస్తున్నాడు.అందుకే తన క్యాబినెట్ మంత్రులకు కూడా ఈ విషయంలో క్లారిటీ ఉండేలా క్లాస్ పీకుతున్నాడు.
తాజాగా జరిగిన మంత్రివర్గ భాటీలోనూ ఇదే అంశాన్ని జగన్ గట్టిగా నొక్కి చెప్పినట్టు తెలుస్తోంది.అవినీతి విషయంలో ఎవరిని క్షమించేది లేదని, ఏపీలో అవినీతి అనే మాట ఎక్కడా వినిపించకూడదని మంత్రులకు జగన్ వివరించాడట.
ప్రస్తుతానికి రాజకీయ అవినీతినుంచి చాలా వరకు కట్టడి చేయగలిగామని, అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఇదే విధంగా అవినీతిని అరికట్టి ప్రజల మనసులు గెలుచుకోవాలని ఆ విషయంలో మంత్రులు ఎక్కువ ద్రుష్టి పెట్టాలని జగన్ సూచనలు చేసాడట.

ఇప్పటికే అవినీతికి దూరంగా ఉండాలన గతంలో ఇద్దరు ముగ్గురు మంత్రులకు జగన్ క్లాస్ తీసుకున్నారనే ప్రచారం కూడా జరిగింది.ప్రస్తుతం అధికారుల స్థాయిలో జరుగుతున్న అవినీతి కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చేశారు.ఇదే విషయాన్ని ఆయన తన కేబినెట్ మంత్రుల దగ్గర కూడా ప్రస్తావించారు.
స్పందన కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా కూడా సీఎం జగన్ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు.అవినీతి నిర్మూలనకు చిత్తశుద్ధితో పని చేస్తున్న విషయాన్ని అంతా గమనించాలని అన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు మంత్రులు సమీక్ష చేసుకోవాలని, ఎవరి శాఖలపై వారు పూర్తి స్థాయిలో పట్టు సాధించి సమర్ధవంతంగా పరిపాలన చేయాలని నిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులకు జగన్ గుర్తు చేశారు.

ఏపీలో పారదర్శక పాలన అందించడమే మన లక్ష్యం అని దీనిలో భాగంగానే రెండు, మూడు వారాల్లో ఏసీబీని రంగంలోకి దించుతామని, వారికి మరిన్ని అధికారాలు కట్టబెట్టి అవినీతి అనేది ఏపీలో ఎక్కడా కనిపించకుండా చేస్తామని జగన్ ఈ సందర్భంగా చెప్పారు.వైసీపీ ప్రభుత్వం మిగతా అన్ని ప్రభుత్వాలకు భిన్నమని, నీతీ నిజాయితీగా పరిపాలన మాత్రమే చేస్తుందనేలా ప్రజల్లో ఒక సదభిప్రాయం కలిగించేలా మనం నడుచుకోవాలని, అందుకే అవినీతి విషయంలో తాను ఇంత కఠినంగా ఉన్నానని జగన్ చెప్పుకొచ్చారు.వైసీపీ దూకుడు తట్టుకోలేకే ప్రతిపక్షాలు లేనిపోనీ ఆరోపణలు గుప్పిస్తూ ప్రభుత్వంపై అవినీతి ముద్ర వేయాలని చూస్తున్నాయని, ఈ విషయంలో అంతా అలెర్ట్ గా ఉండి ప్రతిపక్షల ఆరోపణలను తిప్పికొట్టాలని జగన్ గట్టిగానే మంత్రులకు క్లాస్ పీకినట్టు సమాచారం.