మాతృత్వం అనేది నిజంగా మహిళలకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం.ప్రతి మహిళ తల్లి కావాలని కలలు కంటుంది.
చాలా మందికి ఆ అదృష్టం కలుగుతుంది.కొందరు మాత్రం తమ కలను నిజం చేసుకోలేకపోతారు.
పిల్లలు కలగకపోవడంతో అలాంటి మహిళలకు ఉండే బాధ అంతా ఇంతా కాదు.దీంతో పిల్లల కోసం చాలా మంది మహిళలు పూజలు చేస్తారు.
గుళ్లు, గోపురాలు తిరుగుతారు.అలా అయినా దేవుడు కరుణించి సంతానాన్ని అనుగ్రహిస్తాడని వారి నమ్మకం.
అయితే పిల్లల కోసం ఆలయాలను తిరిగే విషయానికి వస్తే ఆ ఆలయం మాత్రం అందుకు బాగా ప్రసిద్ధి గాంచింది.అందులో మహిళలు నేలపై పడుకుంటే వారికి సంతానం కలుగుతుందట.
ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉందంటే.

హిమాచల్ ప్రదేశ్లోని మాది జిల్లా లాద్ భరోల్ అనే ప్రాంతంలో ఉన్న సిమాస్ అనే గ్రామంలో ఓ ఆలయం ఉంది.ఇక్కడ కొలువై ఉన్న దేవతను సంతాన్ ధాత్రి అని, సింసా దేవి అని పిలుస్తారు.ఈ ఆలయంలో ఒక రోజు రాత్రి నేలపై నిద్రిస్తే అలాంటి మహిళలకు సంతానం కలుగుతుందని స్థానికులు నమ్ముతారు.
అందులో భాగంగానే చుట్టూ ఉన్న పంజాబ్, హర్యానా, చండీగడ్ రాష్ట్రాలకు చెందిన మహిళలు ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో వస్తారు.నవరాత్రి రోజున ఆలయంలో నేలపై నిద్రిస్తారు.
దీంతో వారికి సంతానం కలుగుతుందని నమ్మకం.

అయితే ఆలయంలో నిద్రించే మహిళలకు కలలు వస్తాయట.కలలో దేవత వచ్చి పుష్పం ఇచ్చినట్టుగా కనిపిస్తే అలాంటి వారికి తప్పకుండా పిల్లలు పుడతారట.అలాగే కలలో జామ పండు కనిపిస్తే ఆ మహిళలకు పిల్లాడు, లేదా బెండకాయలు కనిపిస్తే ఆడ శిశువు పుడుతుందట.
ఇవి కాకుండా రాళ్లు, లోహాలు, చెక్క వంటి వస్తువులు కనిపిస్తే అసలు వారికి పిల్లలు కలగరట.దీంతో అలాంటి వారు ఆ ఆలయం నుంచి వెంటనే వెళ్లిపోవాలి.
లేదంటే వారి శరీరంపై మచ్చలు వస్తాయట.ఇక ఆలయం బయట ప్రాంగణంలో ఉండే ఒక భారీ రాయిని ఎవరూ కదిలించలేరట.
కానీ ఎవరైనా తమ చిటికెన వేలితో తోస్తే రాయి కదులుతుందట.ఏది ఏమైనా ఈ సంతాన దేవి ఆలయం విశిష్టతలు భలేగా ఉన్నాయి కదా.!
