కొంతకాలంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని తహతహలాడుతున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ అంతరంగం ఏంటో ఎవరికీ అర్ధం కావడంలేదు.ఆయన ఆ పార్టీ లో చేరబోతున్నాడు ఈ పార్టీలో చేరబోతున్నాడు అంటూ హడావుడి అయితే మాత్రం బాగా జరిగింది.
కానీ ఆయన మాత్రం తాను ఇంకా రాష్ట్రంలో స్టడీ చేయాల్సింది మిగిలిపోయింది అది పూర్తయ్యాకే ఏ పార్టీలో చేరబోయేది చెప్తాను అంటూ చెప్పుకొస్తున్నారు.కానీ ఆయన ఎందుకో వెనకడుగు వేస్తున్నట్టు మాత్రం అర్ధం అవుతోంది.
అసలు లక్ష్మీనారాయణ నేటి రాజకీయ పరిస్థితుల్లో ఇమడగలడా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
జగన్ అవినీతి కేసులకు సంబంధించి విచారణ జరుపుతున్నప్పుడు మీడియా వల్లనో , ఇంకే కారణం వల్లనో ఆయనకు ఓ హీరో ఇమేజ్ వచ్చేసింది.
ఇక ఆయన కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో చేసిన ప్రసంగాలతో ఆ ఇమేజ్ అలా నిలబడిపోయింది.ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆయన ప్రసంగాలు బాగా వైరల్ అవుతున్నాయి.అలాంటి జేడీ రాజకీయాల్లోకి వస్తున్నారు అనగానే పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ సహజమే.జేడీ ప్రసంగాలు చూస్తే కాస్త జాతీయ భావాలు ఎక్కువగా కనిపిస్తాయి.
దానికి తోడు ఆయన మహారాష్ట్ర క్యాడర్ నుంచి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తానని చెప్పేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ గరుడ ప్రస్తావన జోరుగా సాగుతోంది.అందుకే ఆయన్ని కూడా తెలుగు తమ్ముళ్లు కూడా సందేహపడ్డారు.

జనం ఆలోచనలకు తగ్గట్టు జేడీ కూడా ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాలు పర్యటించారు.రైతు సమస్యల మీద ఎక్కువగా దృష్టి సారించారు.ఆ పర్యటనలు పూర్తి అయ్యాక జేడీ ఓ సమగ్ర ప్రణాళిక ప్రకటిస్తారు .ఆ వెంటనే ఏ పార్టీ లో చేరతారు అన్నది కూడా చెప్పేస్తారు అనుకున్నాం.పర్యటనల సందర్భంగా జేడీ వ్యాఖ్యల్ని బట్టి ఆయన బీజేపీ వైపు చూస్తున్నారు అనే వాదనలు వినిపించాయి.అయితే వాటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తన నిర్ణయం తానే ప్రకటిస్తాను అని చెప్పారు.
కానీ ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు.కానీ జేడీ తో సన్నిహితంగా వ్యవహరించే కొందరి మాటల్ని బట్టి కొత్త విషయాలు తెలుస్తున్నాయి.
బీజేపీ మీద ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయనకు అర్ధం అయ్యిందట.దీంతో ఆ పార్టీ లో చేరే ఆలోచన ప్రస్తుతానికి పక్కనబెట్టారట.ఇక జనసేన విషయానికి వస్తే పవన్ చరిష్మా ముందు నిలబడి ఆ ప్రత్యేకత నిలబెట్టుకోవడం చాలా కష్టం.దీనికి తోడు ఆ పార్టీ భవిష్యత్ మీద కూడా నమ్మకం లేదు.
దీంతో జేడీ సైలెంట్ అయినట్టు తెలుస్తోంది.మరికొన్ని రోజులు వేచి చూసి మరీ తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది.
.