2023 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సరికొత్త ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు.తన నిర్ణయాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నా, సొంత పార్టీ నేతలు అడుగడుగునా అడ్డు తగులుతున్న పరిస్థితి నెలకొంది.
అయినా రేవంత్ వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్తూనే, తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.మొన్నటి వరకు అధికార పార్టీ టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ మాత్రమే కనిపించగా, నేడు ఆ స్థానంలో పోటీ పడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
గతంతో పోలిస్తే బీజేపీ బాగా బలపడడం, ప్రధాన ప్రతిపక్షం అన్నట్లుగా బలం పెంచుకోవడం , రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ అన్నట్లుగా వ్యవహారం ఉండడంతో రేవంత్ అలెర్ట్ అవుతున్నారు.కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం పెంచి ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని ఎప్పుడో గుర్తించారు.అందుకే రకరకాల ఎత్తుగడలు వేస్తూ, పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.2023 ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ ఒంటరిగా ఎన్నికలకు వెళితే అది సాధ్యం కాదని, ఖచ్చితంగా కొన్ని పార్టీల మద్దతు ఉండాలని బలంగా నమ్ముతున్నారు.తెలంగాణలోని వామపక్ష పార్టీలు మద్దతు తీసుకోవాలని భావిస్తున్నారు.

ఈ కమ్యూనిస్ట్ పార్టీల మద్దతు ఉంటే దళిత , గిరిజన నియోజకవర్గాల్లో ఫలితం సానుకూలంగా ఉంటుందని, అలాగే బి ఎస్ పి వంటి పార్టీల మద్దతు తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నారట.ఇలా చిన్నచిన్న పార్టీలన్నీంటిని కలుపుకుని వెళితేనే టీఆర్ఎస్ పై విజయం సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందని రేవంత్ భావిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచే పొత్తు విషయమై పార్టీల నేతలతో సంప్రదింపులు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ పొత్తుల వ్యవహారం లో రేవంత్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.