ఏంటో ఈ రాజకీయాలు రాను రాను మరీ దిగజారిపోతున్నాయి.ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడానే లేదు.
ప్రతి పార్టీలోనూ నాయకులు ఇలాగే ఉన్నారు.రాజకీయాల్లో హుందాతనం అనే మాటకే అర్ధం లేకుండా పోయింది.
నాయకులు ఈ మధ్యకాలంలో మరీ శృతిమించిపోయి మరీ ప్రవర్తిస్తున్నారు.వాళ్ళ నోటికి అడ్డేలేకుండా పోయింది.
నాయకుల వరకు కొట్టుకున్నా .తిట్టుకున్నా పర్లేదు కానీ ఇప్పుడు నాయకుల కుటుంబాలను కూడా టార్గెట్ చేసుకుని వ్యక్తిగత విమర్శలకు దిగుతుండడంతో పార్టీలపై ప్రజలకు అసహ్యం కలుగుతోంది.ఇక పార్టీల్లోనూ, నాయకుల్లోనూ విలువల గురించి వెతుకుదాం అంటే ఇసుక నుంచి నూనె తీసినట్టే.
గతంలో వ్యక్తిగత విమర్శలకు ఏమాత్రం చోటు లేని తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు తిట్ల పోకడలు రాజకీయాల పట్ల ఓ అసహ్యాన్ని కలిగిస్తున్నాయి.
తాజాగా పవన్ జగన్ వివాదంలో … సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.అలాగని తెలుగు ప్రజలందరూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ప్రేమ, సానుభూతి కురిపిస్తున్నారనుకోవడం కూడా పొరపాటే.
ఈ ఇద్దరి వ్యక్తిగత దూషణలపై ఇప్పుడు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలే కాదు… ఎక్కడెక్కడి నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

ఇలా వ్యక్తిగత దూషణలు, కుటుంబ వ్యవహారాలను రచ్చకీడ్చుకోవడం ఎంత వరకూ కరెక్ట్ అనేది ఆ నేతలు తెలుసుకోవాలి.వ్యక్తుల ప్రయివేటు బతుకులు వారి వారి సొంతం… పబ్లిక్‌లో నిలబడితేనే ఏమైనా అంటాం” అన్న మహాకవి శ్రీశ్రీ మాటలకు అర్ధం ఇది కాదు అని, రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఏది పడితే అది మాట్లాడడానికి కాదని అంటున్నారు.దీనర్ధం మీరు మా దగ్గరకు వచ్చారు కాబట్టి మేం మిమ్మల్ని ఏమైనా అంటాం అని చెప్పడం.పవన్ కల్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని జగన్… మీ సోదరి మాటేమిటని పవన్ కల్యాణ్ ప్రశ్నించడం వారిద్దరికి ఏం మేలు చేస్తుందో తెలియదు .
రాజకీయాలు వేరు… వ్యక్తిగత జీవితాలు వేరు అని నాయకులు గుర్తించాలి.అందరూ వివిధ మార్గాల్లో ప్రజల కోసమే పని చేస్తున్నామనే భావన ఉండాలి.
ఇందుకోసం ఎవరో ఒకరు ముందుకు రావాలి.అంత వరకూ ఈ వ్యక్తిగత… దారుణ విమర్శలకు… రాజకీయ శత్రువులను అడ్డం పెట్టుకుని మహిళలపై చేస్తున్న విమర్శలకు అంతమే ఉండదు.
ఒకరి మీద ఒకరు ఇలా వ్యక్తిగతంగా పోవడం వల్ల వచ్చే ప్రయోజనం కన్నా కలిగే నష్టమే ఎక్కువ ఉంటుంది
.






