తమ పిల్లలు ఎత్తుగా పెరగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు.అందుకు సంబంధించిన ఆహారం ఇస్తుండడం, ఎక్సర్సైజులు చేయించడం వంటివి చేస్తూ ఉంటారు.
పిల్లలు ఎత్తు పెరగడం అనేది వంశపారంపర్య లక్షణమే అయినా తీసుకునే ఆహారం కూడా ఎదుగుతున్న పిల్లల్లో పెరుగుదలకు దోహద పడుతుంది.అయితే సాధారణంగా పిల్లల్లో 20 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది.
తల్లిదండ్రులు ఎదుగుతున్న తమ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.వారు తీసుకునే ఆహారం, నిద్ర ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినవసరం ఉంది.
ఎత్తు పెరగడం అనేది ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం పైనే ఆధారపడి ఉంటుంది.ఎముకల ఆరోగ్యం కోసం పిల్లలకు ఇచ్చే ఆహారంలో తగిన మోతాదులో ప్రోటీన్లు కాల్షియం విటమిన్ డి ఉండేలా చూసుకోవాలి.
ప్రోటీన్లు కోసం గుడ్లు, మాంసం, చేపలు, పాలు, పెరుగు, పప్పుధాన్యాలు బాదం, ఆక్రోట్ , పిస్తా ఇలాంటి గింజలు తీసుకోవాలి.క్యాల్షియం కోసం ఆకుకూరలు, పాలు, పెరుగు, పనీర్ మొదలైన పదార్థాలను తీసుకోవాలి.
రోజుకు కనీసం అర లీటర్ నుండి లీటర్ పాలు, లేక పాల పదార్థాలు తీసుకుంటే ఎత్తు పెరిగేందుకు సరిపడా కాల్షియం అందుతుంది.
అయితే సహజంగా ఎత్తు పెరగాలంటే ఇంకొన్ని జాగ్రత్తలు పాటించాలి.అవేంటంటే మినరల్స్ అధికంగా ఉన్న పచ్చటి బీన్స్ ను, బ్రకోలి , గోంగూర, క్యాబేజ్, క్యారెట్, గింజధాన్యాలు, అరటిపండ్లు, ద్రాక్ష మొదలైనవి తినడం వల్ల కూడా ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంది.విటమిన్ డి కోసం అరగంట సమయం ఎండలో తిరిగితే శరీరానికి సరిపడా విటమిన్ డి అందుతుంది.
రోజూ కనీసం రెండు వేల క్యాలరీలు శక్తిని ఇచ్చే ఆహారం తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల ఎత్తు మాత్రమే కాదు తగినంత బరువు పెరిగే అవకాశం ఉంది.
ఆహార జాగ్రత్తలతో పాటు రోజు కనీసం అరగంట సమయమైనా వ్యాయామం చేయాలి.రోజుకు 30 నుండి 60 నిమిషాల పాటు వేగంగా నడవడం, పరిగెత్తడం ఏదైనా ఆట ఆడడం లాంటివి చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.
శరీరం ఫిట్ గా ఉండడమే కాక గ్రోత్ హార్మోన్ల పనితీరు మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.