మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తోడళ్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మళ్లీ వైసీపీకి దగ్గరవుతున్నారా ? వైసీపీలో తిరిగి యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారా ? అంటే అవుననే ఆన్సర్లు వినిపిస్తున్నాయి.ప్రకాశం జిల్లాలో కొద్ది రోజులుగా మారుతోన్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను పరుచూరుకు పంపి.
అక్కడ పార్టీ పగ్గాలు ఇవ్వాలని జగన్ చూస్తున్నారు.అయితే ఆమంచి అందుకు ఏ మాత్రం ఒప్పుకోలేదు.తనకు పట్టున్న చీరాలను వదులుకునేందుకు ఆయన సిద్ధంగా లేరు.ఇక దగ్గుబాటి ప్రస్తుతం రాజకీయంగా యాక్టివ్‌గా లేరు.గత ఎన్నికల్లో ఓడిపోయాక భార్య, భర్తలు వేర్వేరు పార్టీల్లో ఉండడంతో జగన్ ఆయన్ను పరుచూరు బాధ్యతల నుంచి తప్పించేశారు.
వాస్తవానికి గత ఎన్నికల్లోనే దగ్గుబాటి తన కుమారుడు హితేష్ చెంచురామయ్య ను ఎన్నికల్లో పోటీ చేయించాలని అనుకున్నారు.
అయితే అమెరికా పౌరసత్వ సమస్య కొలిక్కి రాకపోవడంతో చివరకు ఆ ఎన్నికల్లో దగ్గుబాటి స్వయంగా ఎన్నికల బరిలో వైసీపీ నుంచే పోటీ చేశారు.ఆ ఎన్నికల్లో ఆయన గెలిచి ఉంటే ఖచ్చితంగా స్పీకర్ అవుతారన్న ప్రచారం జరిగింది.
అయితే దురదృష్ట వశాత్తు పార్టీ అధికారంలోకి వచ్చినా దగ్గుబాటి పరుచూరులో ఏలూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు.

ఈ ఓటమి తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు పూర్తిగా సైలెంట్ అయ్యారు.రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.ఆ తర్వాత పురందేశ్వరి బీజేపీని వీడేందుకు ఇష్టపడలేదు.
జగన్ దగ్గుబాటిని పరుచూరు బాధ్యతల నుంచి తప్పించేసి.ఎన్నికల ముందు వరకు ఇన్‌చార్జ్‌గా ఉన్న రావి రామనాథం బాబుకే పగ్గాలు ఇచ్చారు.
ఇక ఇప్పుడు మళ్లీ వైసీపీలో యాక్టివ్ అవ్వాలని చూస్తోన్న దగ్గుబాటి తన కుమారుడు చెంచురామయ్యను పర్చూరు నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా నియమించాలని జిల్లా మంత్రి ద్వారా వైసీపీ అధినాయకత్వానికి రాయబారం పంపినట్లు తెలుస్తోంది.
మరి దగ్గుబాటి కోరికను జగన్ మన్నిస్తారా ? మళ్లీ ఆయనకు పార్టీలో యాక్టివ్ రోల్ ఇవ్వడంతో పాటు పరుచూరు పగ్గాలు ఇస్తారా ? అన్నది సందేహమే .మరి ఏం జరుగుతుందో ? చూడాలి.