తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో పాదయాత్ర చేయాలని, తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడంతో పాటు, అధికారంలోకి తీసుకురావాలనే ఆలోచనతో పాదయాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారు.అయితే ఎప్పటికప్పుడు కాంగ్రెస్ అధిష్టానం నుంచి అనుమతి రాకపోవడంతో ఆయన తన పాదయాత్రను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.
ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడడంతో పాదయాత్ర చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరగడంతో పాటు, జనాల్లోనూ కాంగ్రెస్ పై సానుకూలత పెంచుకోవాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఉన్నారట.
అయితే కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం రేవంత్ పర్యటనకు ఎప్పటికప్పుడు బ్రేకులు వేసే విధంగా అధిష్టానం పెద్దలపై ఒత్తిడి పెంచడం వంటివి చేస్తున్నారట.
అయితే ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో , పాదయాత్ర చేయడం ద్వారానే కాంగ్రెస్ ను అధికారానికి దగ్గర చేయవచ్చనే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం సైతం నమ్ముతోంది.ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి భద్రాచలం నుంచి తన పాదయాత్రను 120 రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
దీనికి సంబంధించిన అనుమతులు ఈరోజు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావు థాక్రే హైదరాబాద్ కు రానున్న నేపథ్యంలో ఈరోజు క్లారిటీ రాబోతున్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించబోతున్నట్లు సమాచారం.అలాగే పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి ఒక్కడే పాదయాత్రకు సిద్ధం కావడాన్ని కాంగ్రెస్ సీనియర్లు చాలామంది ఇష్టపడడం లేదు.
దీంతో పార్టీ రాష్ట్ర కార్యవర్గం అనుమతి తీసుకోవడం ద్వారా అధిష్టానం దగ్గర లైన్ క్లియర్ చేసుకునేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీ కార్యవర్గం తీర్మానం చేస్తే రేవంత్ పాదయాత్రకు అభ్యంతరం తెలపాల్సిన అవసరం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అభిప్రాయపడుతున్నరట.ఇదే విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యరావు థాక్రే కు చెప్పినట్లు సమాచారం.ఈ మేరకు ఈరోజు జరగబోయే సమావేశంలో మాణిక్య రావ్ పాదయాత్ర పై నిర్ణయం తీసుకోబోతున్నారట.
ఏది ఏమైనా రేవంత్ పాదయాత్ర చేయాలని చూస్తున్నా, ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం పాదయాత్ర విషయంలో సానుకూలంగా ఉండడంతో రేవంత్ పాదయాత్రకు ఈరోజు అనుమతి లభించే అవకాశం కనిపిస్తోంది
.