ఆముక్తమాల్యద రచించిన శ్రీకృష్ణదేవరాయల గురించి వినని వారు ఎవరుంటారు! ముఖ్యంగా ఆయన రాయలసీమలో రామ రాజ్యం లాంటి పరిపాలన అందించారు.తెలుగువారందరికీ ఎంతో ప్రీతి పాత్రుడైన శ్రీకృష్ణదేవరాయలు పేరిట పాటలు కూడా వచ్చాయి.“అహో ఆంధ్రభోజా.శ్రీ కృష్ణదేవరాయ” అనే పాట ఇప్పటికీ చాలా మంది తెలుగువారి నోళ్లలో నానుతూనే ఉంటుంది.
శ్రీ కృష్ణ దేవరాయలు అప్పట్లో ప్రస్తుత కర్ణాటక రాష్ట్రంలోని హంపీ గ్రామాన్ని, అనంతపురం జిల్లాలోని పెనుకొండ కోటను రాజధానిగా చేసి తన పరిపాలన అందించారు.విజయనగర సామ్రాజ్యంలో అతని పాలన అప్రతిహతంగా కొనసాగిందనడంలో అతిశయోక్తి లేదు.అయితే ఈ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి మరణించిన తేదీపై సరైన ఆధారాలు లేక స్పష్టత కొరవడింది.1509-1529 మధ్యకాలంలో విజయనగరాన్ని పాలించి తెలుగు భాషను ప్రమోట్ చేసిన దేవరాయల వర్ధంతి తేదీని తెలుసుకోవాలని తెలుగువారూ ఎంతో కృషి చేశారు.ఈ చక్రవర్తి కుమార్తె తిరుమల భాయి (మోహనాంగి) మరీచి పరిణయం గ్రంథంలో తన తండ్రి కృష్ణదేవరాయలు 1471 జనవరి 17న పుట్టారని పేర్కొన్నారు.స్వయంగా కుమార్తె వెల్లడించారు కనుక జయంతిపై ఇప్పటి వరకు ఎలాంటి వివాదం రాలేదు.
కానీ మరణించిన తేదీ ఎవరికీ స్పష్టంగా తెలియరాలేదు.
ఈ క్రమంలోనే తాజాగా కృష్ణదేవరాయలు మరణించిన తేదీ వెలుగులోకి వచ్చింది.
కర్ణాటక రాష్ట్రం తుముకూరు జిల్లా హాన్నేదహల్లిలో ఒక శాసనం లభ్యమైంది.పురావస్తు శాఖ, మైసూరు ఎపీగ్రఫీ విభాగం అధికారుల అన్వేషణలో ఈ శాసనం బయటపడింది.
ఈ శాసనంలోని అక్షరాలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకొని అందులో ఉన్నది ఉన్నట్లు తెలుగు, కన్నడ భాషల్లో అనువదించారు.అయితే ఇందులో శ్రీకృష్ణదేవరాయల గురించి పూర్తి వివరాలు లభించాయి.
శ్రీ కృష్ణ దేవరాయలు 1529 అక్టోబర్ 17న కన్నుమూశారని ఈ శాసనంలో ప్రస్ఫుటంగా పేర్కొన్నట్లు పురావస్తు, కర్ణాటక ఎపీగ్రఫీ అధికారులు వెల్లడించారు.అలాగే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాస్తూ.అక్టోబర్ 17న శ్రీకృష్ణదేవరాయల వర్ధంతిని అధికారికంగా జరపాలని సూచించారు.కాగా ప్రస్తుతం ఈ రాష్ట్రాలు అక్టోబర్ 17న అధికారికంగా శ్రీకృష్ణదేవరాయల వర్ధంతిని జరపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది.