తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.అక్కడ పార్టీ ఉన్నా చెప్పుకోదగిన కార్యక్రమాలు కానీ, నాయకులూ కానీ లేరు.
ఇప్పుడు ఆ పార్టీకి ఉన్నదల్లా ఒకే ఒక్క శాసనసభ్యుడు.తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తరువాత ఆ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టంతా ఏపీ మీదే పెట్టాడు.
రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో బాబు తెలంగాణ విషయాన్ని లైట్ తీసుకున్నాడు.అంతే కాదు అక్కడ పార్టీ ఉన్నా లేకపోయినా ఫర్వాలేదు అన్నట్టుగా వ్యవహరించాడు.
ఇదే సమయంలో తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ టీడీపీలో కీలక నాయకులు అనుకున్న వారందరిని ఆ పార్టీలో చేర్చేసుకున్నారు.దీంతో అక్కడ పార్టీ ఉన్నా లేనట్టుగానే ఉంది.
కాకపోతే నాయకులు పార్టీలు మారినా బలమైన క్యాడర్ మాత్రం అలాగే ఉండిపోయింది.ఇదే ఇప్పుడు చంద్రబాబు లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
తెలంగాణాలో పార్టీకి పునర్వైభవం తీసుకురావాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు.

తాజాగా ఆయన తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు అమరావతిలో చంద్రబాబును కలిశారు.ఈ సందర్భంగా వారితో మాట్లాడిన చంద్రబాబు తెలంగాణలో పార్టీని మళ్లీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందంటూ వారితో వ్యాఖ్యానించారు.దీంతో తెలంగాణ టీడీపీ నేతల్లో కొత్త ఆశలు మొలకెత్తాయి.
అయితే చంద్రబాబు నిజంగానే తెలంగాణ టీడీపీపై దృష్టి పెట్టే పరిస్థితులు ఉన్నాయా అనేదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.తెలంగాణలో టీడీపీ దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది.ఉన్న కొద్దిమంది నాయకుల్లో ఎవరెప్పుడు పార్టీని వీడతారో తెలియని పరిస్థితి.ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో దృష్టి పెట్టడం సాధ్యంకాకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.

ఎందుకంటే ఏపీలో టీడీపీ ప్రస్తుతం ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కుంటోంది.అధికార పార్టీ దూకుడుతో టీడీపీ నేతలు బెంబేలెత్తిపోతున్నారు.ఇప్పటికే కొంతమంది నాయకులు వైసీపీ వేధిపుల భయంతో బీజేపీలో చేరిపోయారు.ఈ దశలో ఏపీలో టీడీపీని మళ్లీ ఒక దారిలో పెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు మీద పడింది.
ఇక్కడ వైసీపీ ఆగడాలకు చెక్ పెడుతూనే పార్టీ నాయకులకు భరోసా కల్పించే చర్యల మీద ఆయన దృష్టిపెట్టాల్సి ఉంది.ఈ దశలో చంద్రబాబు తెలంగాణ రాజకీయాల మీద దృష్టిపెట్టే అవకాశం కనిపించడంలేదు.
కేవలం అక్కడ కార్యకర్తలకు భరోసా కల్పించి ధైర్యం చెప్పేందుకే తప్ప బాబు వ్యాఖ్యల్లో మరో ఉద్దేశం లేదని కొంతమంది టీడీపీ నాయకులే విశ్లేషిస్తున్నారు.