కంటి చూపు లేకపోతే జీవితమే అంధకారం.సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటారు.
అంటే అన్ని ఇంద్రియాలకంటే నేత్రాలే ముఖ్యమైనవని అని అర్థం.అందుకే కంటి ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ సంరక్షించుకోవాలి.
ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా చూపు పోయే అవకాశాలు పెరిగిపోతాయి.సాధారణంగా ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే కంటి సంబంధిత సమస్యలు కనిపించేవి.
కానీ, ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లలు సైతం కంటి సమస్యలతో బాధపడుతున్నారు.
అయితే కంటి ఆరోగ్యం దెబ్బ తింటుంది అన్న విషయాన్ని ముందే గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇలా చేస్తే కంటి సమస్యలు దరి చేరకుండా అడ్డుకోవచ్చు.మరి ఇంతకీ కళ్లు డేంజర్‌లో ఉన్నాయని సూచించే లక్షణాలు ఏంటీ.? ఎలా ఉంటాయి.? వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉన్నట్లు ఉండి కంటి చూపు తగ్గడం.కళ్లు ప్రమాదంలో ఉన్నాయని తెలిపే లక్షణం.మీ చూపు తగ్గిందని మీకు అనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి చకప్ చేయించుకోవాలి.ఏదైనా తేడా ఉంటే వైద్యులు సూచించిన మందులు వాడాలి.
అలాగే కొందరికి తరచూ కళ్లు ఎరుపెక్కుతుంటాయి.కానీ, చాలా మంది దీనిని పెద్దగా పట్టించుకోరు.అయితే కంటి సంబంధిత సమస్యలను సూచించే సర్వ సాధారణమైన లక్షణం ఇది.అందుకే తరచూ కళ్లు ఎరుపెక్కుతుంటే వైద్య నిపుణుడిని సంప్రదించాలి.

కళ్లు డేంజర్‌లో ఉన్నాయని తెలిపే మరో లక్షణం తలనొప్పి.చీటికి మాటికి తలనొప్పి వస్తుంటే పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకండి.పెయిన్ కిల్లర్స్ ను వేసుకుంటూ నొప్పిని తగ్గించుకోవడం మానేసి వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇక కొందరికి కళ్ల చుట్టు నిరంతరంగా నొప్పి పుడుతుంటుంది.
ఇదీ కంటి ఆరోగ్యం ప్రమాదంలో ఉందని తెలిపే ఓ లక్షణం.కాబట్టి, కళ్ల చుట్టు నొప్పి వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మర్చిపోకూడదు.