అందరి లెక్క ఒకటైతే టీడీపీ అధినేత చంద్రబాబు పొలిటికల్ లెక్కలు మరో విధంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు మరీ ముఖ్యంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ పరిస్థితి ఇప్పుడు ఇబ్బందిగా మారింది.ఇక్కడ 89 పంచాయతీలు ఉంటే 74 చోట్ల వైసీపీ మద్దతు దారులు గెలుపు గుర్రం ఎక్కారు.
మిగిలిన వాటిలోనూ 14 చోట్ల మాత్రమే టీడీపీ మద్దతు దారులు విజయం సాధించారు.అయితే ఎలా గెలిచారు అనే విషయాన్ని పక్కన పెడితే.
ఎన్నికల కమిషన్ ఆమోదించిన తర్వాత వారి గెలుపు మాత్రం ఖాయమైన నేపథ్యంలో ఇక, ఎవరు ఎన్ని వంకలు పెట్టినా ప్రయోజనం ఉండదు.
కానీ, చంద్రబాబు మాత్రం కుప్పంలో టీడీపీ ఓటమిపై చిత్రమైన కామెంట్లు చేస్తున్నారు.ఇక్కడ వైసీపీ గెలవలేదని ప్రజాస్వామ్యం ఓడిందని బాబు చేసిన కామెంట్లపై టీడీపీలోని ఓ వర్గం విస్తుపోతోంది.జరిగింది పొరపాటే.
దీనికి సంబంధించి ముందు నుంచి కూడా అనేక హెచ్చరికలు ఉన్నాయి.అనేక మంది కుప్పంలో పరిస్థితిని ముందుగానే చంద్రబాబుకు విసదీకరించారు.
అనేక మీడియా చానెళ్లు గ్రౌండ్ రిపోర్టును కూడా అందించాయి.జిల్లాకే చెందిన మంత్రి పెద్దిరెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కుప్పాన్ని బాగా టార్గెట్‌గా పెట్టుకున్నారు.
అయినప్పటికీ.చంద్రబాబు మాత్రం పట్టించకోనట్టు వ్యవహరించారు.
ఫలితంగా కుప్పం చేదాటి పోయింది.
పైగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఎదిగిన నాయకులెవరూ పంచాయతీ ఎన్నికల బరిలో నిలవలేదు కొత్త వారికి అవకాశం అనే అధినేత ఆదేశాలతో దూరంగానే ఉండిపోయారు.పోనీ ఎన్నికల్లో నిలిచిన వారికి అండగా ఉన్నారా అంటే అదీ లేదు.ఖర్చు సంగతి పక్కనపెడితే కనీసం అభ్యర్థి వెన్నంటి ఉండి ధైర్యమూ చెప్పలేదు.
దీనికి బాబు నుంచి సరైన దిశానిర్దేశం లేక పోవడమే కారణమని అంటున్నారు.చాలా చోట్ల గ్రామాల్లో పెద్దగా బలంలేని వారినే పోటీకి నిలపాల్సి వచ్చింది.
ఇక పోలింగ్ రోజున బూత్‌ల వద్ద అభ్యర్థులు తప్ప, ఆయా ప్రాంతాల్లోని టీడీపీ సీనియర్ నాయకులు ఎవరూ కనిపించలేదు.
అంటే అప్పటికే టీడీపీ బలహీన పడింది.
ఈ విషయం చంద్రబాబుకు తెలుసు గత ఎన్నికల్లో ఆయన మెజార్టీ దారుణంగా పడిపోయినప్పటి నుంచే ఆయన కుప్పాన్ని సెట్ చేసుకోకుండా గాలికి వదిలేశారు.ఇక స్థానిక ఎన్నికల్లో అక్కడక్కడా ఒకరిద్దరు మెరుపులా మెరిసి మాయమయ్యారు అధికార పార్టీ డబ్బులు పంచుతోంది అని శోకాలు తీసేవారు తప్ప తమ అభ్యర్థులకు ఆర్థికంగా-నైతికంగా అండగా నిలిచేవారు కనిపించలేదు.
దీంతో టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు.ఇప్పుడు ఆలోచిస్తే సంస్థాగతంగా కుప్పం ఓటమికి కారకులు తెలుస్తూనే ఉంది.మరి ఈ అసలు లెక్క వదిలేసి వేరే లెక్కలు చెబితే మొత్తానికే మోసం అంటున్నారు పరిశీలకులు.