మనం పుట్టి పెరిగిన వాతావరణం, మన మీద ఉన్న బాధ్యతలే మన ప్రవర్తనను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.చదువు ఒక్కటే కాదు.
ఎంతో చదువుకున్న వాళ్లు కూడా కొన్నిసార్లు మరీ దారుణంగా ప్రవర్తిస్తారు.అదే సమయంలో, పెద్దగా చదువు లేని వాళ్లు కూడా మంచి మర్యాద, గొప్ప విలువలతో బతుకుతుంటారు.
ఇక మన దేశంలో చాలామంది పిల్లలు చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు మోస్తుంటారు.కొంతమందికి సంపాదించడం తప్పనిసరి పరిస్థితి.
డబ్బు సంపాదించడానికి కష్టపడాల్సిన అవసరం లేదు కానీ, కొందరు మాత్రం ఉచితంగా వచ్చే డబ్బును వద్దనుకుని కష్టపడి సంపాదించాలనే పట్టుదలతో ఉంటారు.
ఇలాంటి మనస్తత్వం ఉన్న ఓ బుడ్డోడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. దమన్ బీచ్‌లో( Daman Beach ) అప్పడాలు అమ్ముకుంటున్న ఓ కుర్రాడు ఒక వ్యక్తితో మాట్లాడిన మాటలు నెటిజన్ల గుండెల్ని హత్తుకున్నాయి. ‘యూనిక్ వైరల్ ట్రస్ట్’( ‘Unique Viral Trust ) అనే ఇన్‌స్టా ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా, ఇప్పటికే దాదాపు కోటి మందికి పైగా చూసేశారు.వీడియో చూసిన వాళ్లంతా ఆ పిల్లాడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
వీడియోలో ఆ బుడ్డోడు రోజంతా ఒక్క అప్పడం కూడా అమ్మలేదని బాధగా చెబుతాడు.అప్పడం ఎంత అని ఆ వ్యక్తి అడిగితే, ఒక్కో ప్యాకెట్ రూ.30 అని బదులిస్తాడు.ఆ వ్యక్తి కావాలనే ఆటపట్టిస్తూ రూ.5లే ఇస్తానంటాడు.ఆ పిల్లవాడు కాసేపు ఆలోచించి సరేనంటాడు.
కానీ, ఆ వ్యక్తి మాత్రం ఏకంగా రూ 500 నోటు తీసి అతనికి ఇస్తాడు.
అంత కష్టాల్లో ఉన్నా ఆ పిల్లాడు మాత్రం తన ఆత్మగౌరవాన్ని వదులుకోలేదు.“నేను పని చేస్తాను కానీ, భిక్షం ఎత్తుకోను” అని ఆ డబ్బును తిరస్కరిస్తాడు.ఆ పిల్లాడి గౌరవానికి ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి, ఆ డబ్బును వాళ్ల అమ్మ కోసం తీసుకోమని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు.చాలాసేపు చెప్పాక ఆ కుర్రాడు సరేనని ఒప్పుకుంటాడు.
గుండెను హత్తుకునే ఈ సంభాషణ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.ఆ పిల్లాడి ఆత్మగౌరవం, కష్టపడే తత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కష్టాల్లో ఉన్నా విలువలను వదులుకోకూడదని, నిజాయితీగా బతకాలని ఈ వీడియో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది.వయసుతో సంబంధం లేకుండా కొందరు ఎంత గొప్పగా ఉంటారో ఈ వీడియో మరోసారి గుర్తు చేసింది.