దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల( Jamili Elections ) ప్రస్తావన హాట్ టాపిక్ గా మారింది.జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంతో దేశమంతా ఒకేసారి అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికలను నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ఎన్నికల విషయంలో సానుకూలంగా ఉంది.అయితే జమిలి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంలో ఇంకా ఏ క్లారిటీ లేదు.
దీనికి మరి కొంత సమయం పడుతుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.రామ్ నాథ్ కోవింద్ కమిటీ( Ramnath Kovind Committee ) రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడంతో పాటు , రాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర అధికార పార్టీ బిజెపి భావిస్తోంది.
అయితే ఈ బిల్లుకు ఎన్డీఏలో కీలక భాగస్వామ్యంగా ఉన్న టిడిపి అంగీకరిస్తుందా ? అసలు జమిలి ఎన్నికల విషయంలో టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) వైకిరి ఏమిటనేది ఇంకా ఏ క్లారిటీ లేదు.
ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభలలో బిల్లు ఆమోదం పొందాలంటే చంద్రబాబుతో పాటు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా మద్దతు తెలపాల్సి ఉంటుంది.అయితే చంద్రబాబు మధ్యంతర ఎన్నికలకు అంగీకరిస్తారా అంటే ఆయన అంత తేలిగ్గా దీనికి అంగీకరించే అవకాశం కనిపించడం లేదు.ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు టిడిపి, జనసేన , బిజెపి కూటమి 164 స్థానాలు దక్కించుకుంది.
టిడిపి( TDP ) చరిత్రలో ఇంతటి ఘన విజయం దక్కడం ఇదే మొదటిసారి .దీంతో జమిలి ఎన్నికలకు వెళ్లేందుకు చంద్రబాబు అంగీకరించే ఛాన్స్ కనిపించడం లేదు.ఎందుకంటే మళ్లీ ఎన్నికలు జరిగితే ఇప్పుడు వచ్చిన తరహాలోనే సీట్లు వస్తాయా అంటే ఆ పరిస్థితి దాదాపుగా ఉండక పోవచ్చు.
ఇప్పటికే సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల హామీలను నెరవేర్చడంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఇంకా వెనకబడే ఉంది.దీనికి తోడు మళ్ళీ ఎన్నికలకు వెళ్తే భారీగా సొమ్ములు ఖర్చు చేయాల్సి ఉంటుంది.అయితే కేంద్ర బిజెపి పెద్దలు చంద్రబాబు ను బుజ్జగించినా, జమిలి ఎన్నికల విషయంలో అంత తేలిగ్గా ఒప్పుకునే ఛాన్స్ అంతంత మాత్రమే.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే, చంద్రబాబు మద్దతు చాలా అవసరం.శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందినా, ఆ తరువాత రాంనాథ్ కోవింధ్ కమిటీ సిఫార్సుల మేరకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది.
అయితే ఇవన్నీ అంత తేలిగ్గా జరుగుతాయా అనేది సందేహమే. కాంగ్రెస్ తో పాటు మరో 15 పార్టీలు జమిలి ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు వైకిరేమిటి అనేది తేలాల్సి ఉంది.