యాదాద్రి భువనగిరి జిల్లా: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట( Yadagirigutta )కు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఆలయ ప్రాశస్త్యాన్ని వీక్షించేందుకు దేశ విదేశాల నుండి కూడా భక్తులు వస్తున్నారు.
ఇంతటి ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆధ్యాత్మిక కేంద్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చి భక్తులతో పాటు,ఆలయ ఆస్తులను సైతం నిలువు దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.కొండపై వర్తక వ్యాపారులుఆలయ అధికారులతో కుమ్మక్కై చేస్తున్న ఆగడాలకు అంతులేకుండా పోయిందని మీడియా, సోషల్ మీడియా( Social media ) కోడై కూస్తోంది.
ఇదిలా ఉంటే కొండపై వర్తక సంఘం( Trade association ) ఆధ్వర్యంలో నడిచే దుకాణాల షెడ్యూల్ గడువుతీరిన వెంటనే ప్రతి ఏటా టెండర్లకు ప్రకటన ఇచ్చి,తద్వారా దుకాణాలు ఏర్పాటు చేయాలి.ఆలయ అధికారులు అందుకు భిన్నంగా వర్తక వ్యాపారులతో కుమ్మక్కై, కొత్త టెండర్ల ప్రక్రియ లేకుండా రెన్యువల్ పేరుతో దుకాణాల కొనసాగిస్తూ, టెండర్ల ద్వారా వచ్చే ఆలయ ఆదాయానికి భారీగా గండి కొడుతూ, అధిక ధరలతో భక్తులకు శఠగోపం పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇకపోతే ఆలయ పునరుద్ధరణ సమయంలో కొండపై దుకాణాలు తొలగించారు.
కొండ కింద దుకాణాల సముదాయం నిర్మించి వర్తక సంఘం వ్యాపారులకు ఇవ్వడానికి దేవస్థాన అధికారులు నిర్ణయించి నిర్మాణం చేపట్టారు.
కానీ,ఆ దుకాణ సముదాయం నేటికీపూర్తి కాలేదు.గతంలో కొండపైన దుకాణాలను టెండర్ వేయకుండా ఉండేందుకు వర్తక సంఘం వారు గత ఈవో గీతారెడ్డికి కోటిన్నర ఇచ్చి టెండర్ల ప్రకటనను రద్దు చేయించారని పత్రికల్లో ఆరోపణలు వచ్చినా పట్టించుకున్న నాథుడే లేడు.కొండపై110 దుకాణాలు ఉంటే కేవలం 10 మాత్రమే మధ్య తరగతికి చెందిన వారివి కాగా మిగిలిన 100 ఎన్నారైలు,బడా వ్యాపారవేత్తలు,ధనవంతులు ఉన్నారు.వీరిలో దేవస్థాన అధికారుల బంధువులు,మిత్రులు, శ్రేయోభిలాషులు ఉన్నట్లు తెలుస్తోంది.
దేవస్థానంలో ఫార్మ్ పేరుతో నకిలీ బిల్లులకు ఆమోదం పొందుతూ దేవస్థాన ఆదాయానికి గండి కొడుతున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి.ఈ మొత్తం వ్యవహారంపై దేవాదాయ,ధర్మాదాయ శాఖ తక్షణమే స్పందించి సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ వస్తుంది.
పనిలో పనిగా దుకాణాల టెండర్ ప్రక్రియ చేపట్రాలని, కొండపైన దుకాణాలను టెండర్లు వెయ్యడం వల్ల దేవస్థానానికి సుమారు ఐదు నుంచి ఏడు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని తద్వారా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.అలాగే కొండ కింద దుకాణ సముదాయాన్ని ప్రారంభించి,పంపిణీ చేయాలని కోరుతున్నారు.