దక్షిణాఫ్రికాలో వేల కోట్ల అవినీతికి పాల్పడి ప్రస్తుతం యూఏఈలో ఆశ్రయం పొందుతున్న భారత సంతతి సోదరులు గుప్తా బ్రదర్స్‌కి సంబంధించి సౌతాఫ్రికా ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది.గుప్తా బ్రదర్స్( Gupta brothers ) వనాటు పౌరసత్వం పొందారనే వార్తల నేపథ్యంలో స్పందించింది.
గుప్తా బ్రదర్స్ ఇంకా దక్షిణాఫ్రికా పాస్‌పోర్టులనే వినియోగిస్తున్నారని ఆ దేశ హోం వ్యవహారాల శాఖ మంత్రి ఆరోన్ మోత్సోఅలెడి అన్నారు.ఇక గుప్తా బ్రదర్స్ ప్రస్తుతం ఆస్ట్రేలియాకు తూర్పున వున్న దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీప దేశమైన వనాటు( Vanuatu ) పౌరసత్వం పొందినట్లుగా మీడియాలో వస్తున్న కథనాలపై ఆరోన్ స్పందించారు.
అవినీతిపరుడైన ఓ హోం వ్యవహారాల అధికారి నుంచి గుప్తా బ్రదర్స్ పాస్‌పోర్టులను పొందారని.సదరు అధికారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
అయితే వారి పాస్‌పోర్టులను రద్దు చేయడానికి, గుప్తా బ్రదర్స్ పౌరసత్వాన్ని రద్దు చేయడానికి తమ శాఖ వద్ద ఎలాంటి ప్రణాళికలు లేవని ఆరోన్ తెలిపారు.అప్పగింతల ప్రక్రియపై యూఏఈకి అప్పీల్ చేయడం అర్థరహితమని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా.వనాటు డైలీ పోస్ట్ నివేదిక ప్రకారం గుప్తా బ్రదర్స్‌కు వ్యతిరేకంగా వనాటు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ).వనాటు పౌరసత్వ కార్యాలయానికి ప్రతికూల సమాచారం అందించిందని తెలిపింది.అయితే ఈ కార్యాలయం, ఆ దేశ ఇమ్మిగ్రేషన్ శాఖలు మాత్రం గుప్తా బ్రదర్స్ ప్రస్తుతం వనాటులో నివసిస్తున్నారో లేదో చెప్పడానికి నిరాకరించిందని వార్తాసంస్థ తెలిపింది.
గతంలో ఆఫ్రికన్ దేశాలైన కామెరూన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లలో గుప్తా బ్రదర్స్ ఆశ్రయం పొందుతున్నట్లు ప్రచారం జరిగింది.

గత వారం దక్షిణాఫ్రికా న్యాయ శాఖ మంత్రి రోనాల్డ్ లామోలా(Ronald Lamola ) మాట్లాడుతూ.మోసం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న గుప్తా బ్రదర్స్‌ను తమకు అప్పగించాలన్న అభ్యర్ధనను యూఏఈ తిరస్కరించిందని తెలిపారు.ఈ నిర్ణయంతో తమ ప్రభుత్వం దిగ్భ్రాంతి చెందిందన్నారు.
మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాతో సాన్నిహిత్యం ద్వారా గుప్తా సోదరులైన అజయ్, అతుల్, రాజేశ్‌లు బిలియన్ డాలర్ల విలువైన అక్రమాలకు పాల్పడ్డారని ఎన్పీఏ దర్యాప్తులో తేలింది.ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలో జుమా పదవిని సైతం కోల్పోవాల్సి వచ్చింది.

జుమా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న గుప్తా బ్రదర్స్ రాజకీయాల్లోనూ తమ హవా కొనసాగించారు.అధ్యక్షుడితో సత్సంబంధాలు పెంచుకున్న వీరు కేబినెట్లో ఎవరు ఉండాలి? ఎవరికి ఎటువంటి బాధ్యతలు అప్పగించాలి? అన్న విషయాలను కూడా శాసించే స్థాయికి చేరుకున్నారు.గుప్తా బ్రదర్స్‌ది యూపీలోని షహరాన్‌పూర్.స్థానిక రాణి బజార్లో వీరి తండ్రి శివకుమార్‌కు రేషన్ షాపు ఉండేది.వీరిని స్థానికులు ఇప్పటికీ ‘రేషన్ షాపోళ్లు’ గానే పిలుస్తుంటారు.తండ్రి స్మారకార్థం ఓ దేవాలయాన్ని నిర్మించిన గుప్తా బ్రదర్స్ ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఇక్కడి శివరాత్రి ఉత్సవాలకు హాజరవుతారు.