చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగం ఏదైనా సరే.ప్రపంచంలోని ఎన్నో దేశాల యువత డెస్టినేషన్ అమెరికా.
నాణ్యతతో కూడిన విద్య, మంచి ఉపాధి మార్గాలు, మెరుగైన జీవన విధానాలతో అగ్రరాజ్యం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.అందుకే కోట్లాది మంది యువత అమెరికా వెళ్లాలని కలలు కంటారు.
భారతీయులు ఈ విషయంలో ముందున్నారు.కేంద్ర ప్రభుత్వం కృషి, ప్రవాసీ సంఘాల తోడ్పాటు కారణంగా భారతీయులు అమెరికాలో చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అయితే మనలాగే ఎన్నో దేశాల వాసులకు అమెరికా డెస్టినేషన్ కావడంతో వారికి కూడా వీసాలు అందజేయడం అగ్రరాజ్యానికి ఇబ్బందిగా మారింది.అయినప్పటికీ కోటా పెట్టి వీసాలను సర్దుబాటు చేస్తూ వస్తోంది.
ఇకపోతే… గతేడాది భారతీయ విద్యార్ధులకు అత్యధికంగా 1.25 లక్షల వీసాలను జారీ చేసినట్లు అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైజ్ మీడియాకు తెలిపారు.2016 తర్వాత ఈ స్థాయిలో భారతీయ విద్యార్ధులకు వీసాలు మంజూరు చేయడం ఇదే తొలిసారని ఆయన వెల్లడించారు.ప్రపంచవ్యాప్తంగా కరోనా అదుపులోకి రావడం, ఆంక్షల్ని సడలిస్తూ వుండటంతో అమెరికాలో విద్యకు భారత్ సహా అన్ని దేశాల నుంచి డిమాండ్ మళ్లీ పెరిగిందని నెడ్ ప్రైస్ వ్యాఖ్యానించారు.
కోవిడ్ నేపథ్యంలో సిబ్బంది కొరత , ఇతర కారణాల వల్ల వీసాల జారీ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని.దీనిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.ఏడాదిలోగా కోవిడ్ ముందు నాటి స్థితికి చేరుకుంటామని నెడ్‌ప్రైస్ వెల్లడించారు.

ఇదిలావుండగా.కోవిడ్ తదితర కారణాల వల్ల దౌత్యకార్యాలయాల్లో వీసా ఇంటర్వ్యూలను అమెరికా ప్రభుత్వం కొన్ని నెలలుగా మినహాయిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా దీనిని మరోసారి పొడిగించింది.2023 డిసెంబర్ 31 వరకు వలసేతర వీసా కేటగిరీల్లో ఇంటర్వ్యూలకు ఇస్తున్న మినహాయింపును పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.అయితే కొత్తగా వీసాలు పొందేవారు, రెన్యూవల్ చేయించుకునే వారిని ఇంటర్వ్యూలకు పిలవాలా లేదా అని నిర్ణయించే అధికారాన్ని కాన్సులర్ అధికారులకే వదిలేసింది.
అమెరికా ప్రభుత్వ నిర్ణయం వల్ల వీసా నిరీక్షణ సమయం బాగా తగ్గనుంది.తాత్కాలిక వ్యవసాయ,వ్యవసాయేతర కార్మికులు,విద్యార్ధులు,అకడమిక్ ఎక్స్చేంజీ విజిటర్స్,ప్రత్యేక వృత్తి నిపుణులు తదితర నిర్దిష్ట వలసేతర వీసాదారులకు ఈ ఇంటర్వ్యూ మినహాయింపు వర్తిస్తుంది.