తెలంగాణ కాంగ్రెస్ లో ఇక సీనియర్ నేతల మాటలకు కాంగ్రెస్ అధిష్టానం పెద్దగా విలువ ఇవ్వదలుచుకోలేదు అనే విషయం అర్థం అయిపోయింది.ముఖ్యంగా రేవంత్ రెడ్డి విషయంలో సీనియర్ నాయకులు ఎంతగా అసంతృప్తి వ్యక్తం చేసినా, ఎన్ని ఫిర్యాదులు చేసినా, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ పైనే పూర్తిగా ఆశలు పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.
రాబోయే ఎన్నికల్లో రేవంత్ వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తేనే కాంగ్రెస్ పరిస్థితి కాస్త మెరుగవుతుందని, రేవంత్ ను వ్యతిరేకిస్తున్న సీనియర్ నాయకులను నమ్ముకుని ముందుకు వెళ్లడం ద్వారా పార్టీ మరింతగా దెబ్బతింటుందనే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది.అందుకే ఇటీవల నియమించిన పార్టీ కమిటీ నియామకాల్లో పూర్తిగా రేవంత్ వర్గానికి పెద్దపీట వేశారు.
దీంట్లో సీనియర్ నాయకులను చాలావరకు పక్కన పెట్టారు.
ఈ విషయంలో ఎన్ని అసంతృప్తులు, ఫిర్యాదులు , అలకలు వ్యక్తమైనా, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు అర్థమవుతుంది.
రాబోయే ఎన్నికల్లో బిజెపి టీఆర్ఎస్ లను ఎదుర్కొనేందుకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు వెళితే అది సాధ్యం కాదని, ఆయనను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మార్చాలంటూ కాంగ్రెస్ అధిష్టానం కు ఫిర్యాదులు అనేకం వెళ్లాయి.అయినా ఆయనను మార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఏమాత్రం ఇష్టపడడం లేదు.
రేవంత్ సారధ్యంలోనే రాబోయే ఎన్నికలను ఎదుర్కోవాలని బలంగా డిసైడ్ అయింది.కొద్ది మంది పార్టీని వీడి బయటకు వెళ్లినా నష్టం లేదన్నట్లుగా భావిస్తోంది.
సొంత పార్టీ నాయకులను బలహీనపరిచే విధంగా సీనియర్ నాయకులు కొంతమంది వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆగ్రహంతో ఉంది.తెలంగాణలో టిఆర్ఎస్ బిజెపిల పై పోరాడే విషయంపై దృష్టి పెట్టకుండా సొంత పార్టీ నేతల పైనే ఫిర్యాదులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని అధిష్టానం తీవ్ర ఆగ్రహంతో ఉంది.ఇదే పరిస్థితి ఎన్నికల వరకు కొనసాగితే కాంగ్రెస్ మరింతగా దెబ్బతింటుందని ,ఆ పార్టీ అధిష్టానం భావిస్తుండడంతోనే రేవంత్ కు మరింతగా ప్రాధాన్యం పెంచి, ఆయనపై ఇక ఎన్ని ఫిర్యాదులు చేసినా, తాము పట్టించుకోమనే సంకేతాలను కాంగ్రెస్ సీనియర్ నేతలకు పంపించింది.ఇక రేవంత్ ఫిర్యాదులు చేసేందుకు ఎన్నిసార్లు ఢిల్లీ వచ్చినా లాభం లేదనే విషయాన్ని ఇటీవల ప్రకటించిన కమిటీల నియామకం ద్వారా అధిష్టానం బయట పెట్టడంతో, కాంగ్రెస్ సీనియర్లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట.