2024 లో జరగబోయే ఎన్నికలపై అందరికీ ఆసక్తి, ఉత్కంఠ కలుగుతూనే ఉంది.ముఖ్యంగా వైసీపీ, బిజెపి ,జనసేన లు ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
అనేక రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.ఇప్పుడే ఎన్నికల వాతావరణం ఏపీలో కనిపిస్తోంది.
అధికార పార్టీ వైసీపీని ఇరుకుని పెట్టే విధంగా బిజెపి, జనసేన, టిడిపిలు విడివిడిగా ప్రయత్నాలు చేస్తున్నాయి.అయితే ఎవరికివారు వైసీపీపై పోరాటం చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది అని, తద్వారా మళ్ళీ వైసీపీకే విజయావకాశాలు ఉంటాయనే భయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు, టిడిపిలోనూ ఉంది.
అందుకే బిజెపి, జనసేన ,టిడిపిలు ఒక కూటమిగా ఏర్పడి వైసిపిని ఎదుర్కొంటే ఫలితం ఆశాజనకంగా ఉంటుందని భావిస్తుండగా, ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపిని కలుపుకుని వెళ్లేందుకు బిజెపి ఇష్టపడడం లేదు.ఇక బిజెపితో తెగచింపులు చేసుకునైనా సరే, టిడిపి తో కలిసి వెళ్లాలని ప్రయత్నించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇటీవల విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోది అపాయింట్మెంట్ ఇచ్చారు.
ఈ సందర్భంగా పవన్ కు 2024 ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చినట్లు అర్థమైంది.ప్రధానితో సమావేశం తర్వాత పవన్ లో ఉత్సాహం కనిపించలేదు.అసలు బిజెపి టార్గెట్ 2024 కాదని , 2029 అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2024 ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చినా, టిడిపి పూర్తిగా బలహీనం అవుతుందని, అప్పుడు టిడిపి స్థానంలోకి బిజెపి వస్తుందని, ఆ లెక్కన 2029 ఎన్నికల్లో కచ్చితంగా బిజెపి, జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని బిజెపి పెద్దలు అంచనా వేస్తున్నారట.

అలా కాకపోయినా 2024 ఎన్నికల్లో టిడిపి , వైసిపిలకు సంపూర్ణ మెజారిటీ రాకపోతే జనసేన, బీజేపీలకు వచ్చే స్థానాలే కీలకమవతాయని, అప్పుడు టిడిపి, వైసీపీలలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చినా, తామే కీలకం అవుతామని, అందుకే టిడిపికి వీలైనంత దూరంగా ఉండాలని పవన్ కు హిత బోధ చేశారట.అందుకే పవన్ ను టిడిపి తో కలవకుండా బీజేపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి.అయితే టిడిపి తో పొత్తు పెట్టుకోవాలని పవన్ లో బలమైన కాంక్ష ఉన్నా, బిజెపి కి దూరం అయితే తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పవన్ బీజేపీ బాటలోనే వెళ్లాలని డిసైడ్ అయ్యారట.